ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం : చంద్రబాబు, పవన్‌

  • ముగిసిన సీఈసీ సమీక్ష..

ప్రజాశక్తి-విజయవాడ:  కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌లు, వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో భేటీ అయ్యారు. వీరితో పాటు బిజెపి, సీపీఎం, బీఎస్పీ, ఆప్‌ నేతలు హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబాబు, పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో సజావుగా ఎన్నికలు సాగాయి. ఇక్కడ కూడా అలాగే నిర్వహించేలా చూడాలన్నారు. ప్రజల్లో తిరుగుబాటు రావడంతో, హౌల్‌ సేల్‌గా ఓటర్లందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేం అనే తుది నిర్ణయానికి వచ్చారని చంద్రబాబు వివరించారు. దీనికి సంబంధించి సీఈసీకి ఇవాళ ఒక ఉదాహరణ ఇచ్చామని, ఒక్క చంద్రగిరిలోనే ఫారం-6 కింద 1 లక్ష 15 వేల ఓట్లు ఇచ్చారని తెలిపారు. వాటిలో దాదాపు 33 వేల ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సీఈసీకి ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. అలాగే బీఎల్వోలుగా 2,600 మంది మహిళా పోలీసులను నియమించారని.. నాకిది ఆశ్చర్యం వేస్తోందన్నారు. బీఎల్వోలుగా ఏంచేయాలో మహిళా పోలీసులకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. ఇవన్నీ మేం అడుగుతున్నామని మాపైనా, జనసేన పైనా 6 వేల నుంచి 7 వేల వరకు అక్రమ కేసులు పెట్టారు. ఈ కేసుల బారినపడి ఒక్క పుంగనూరులోనే 200 మందికి పైగా జైలుకు వెళ్లారు. ఎన్నికల్లో విపక్షాలను పనిచేసుకోనివ్వరాదనే ఈ అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్లు కోరుకున్నది జరిగితే ప్రజాస్వామ్యం అంతరించిపోతుందన్నారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థ రాజ్యంగ వ్యతిరేకం అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చర్యలు చేపట్లాలన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

➡️