సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల ఆందోళన

Dec 23,2023 11:21 #continues, #SSA employees, #strike

ప్రజాశక్తి-యంత్రాంగం : తమన్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని.. అప్పటి వరకు సమ్మెను విరమించబోమని సర్వ శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్‌ స్కీమ్‌లు అమలు పరచాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. వీరి సమ్మెకు యుటిఎఫ్‌, ఎస్‌టియు, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.

విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రాథమిక విద్య వృద్ధి కోసం పాటుపడుతున్న వారి పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. అనకాపల్లి లో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు ఐటిడిఎ వద్ద ఆందోళన చేశారు. నెల్లూరులో సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మద్దతు తెలిపారు. విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్‌లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలో సమ్మె శిబిరాన్ని సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు సందర్శించి మాట్లాడారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విజయనగరంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో యుటి ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సర్వశిక్ష ఉద్యోగులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కోలాటం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు.

కాకినాడలో మానవహారం నిర్వహించారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆందోళన కొనసాగించారు. ఏలూరులో కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్ట్‌ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్‌ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ పాల్గొన్నారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు మాజీ మంత్రి పరిటాల సునీత మద్దతు తెలిపారు. సత్యసాయి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గణేష్‌ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మద్దతుగా పాల్గొన్నారు. బాపట్లలో చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. చైల్డ్‌ కేర్‌ లీవులు కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ చిన్నారి తన తండ్రితో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. కర్నూలులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు, ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజరుకుమార్‌ పాల్గొన్నారు. కృష్ణా, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ఆందోళనలు కొనసాగించారు.

➡️