విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం

Jun 18,2024 21:40 #Palla srinivasaarao, #press meet

-టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేసి, యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన ఆయన మంగళవారం ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యాలయానికి వచ్చారు. ఆయనకు టిడిపి విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏడాదిన్నరలోగా అమరావతికి ఒక రూపు వస్తుందన్నారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పిన వైసిపి గంజాయికి రాజధానిగా మార్చేసిందని విమర్శించారు. ఈ నగరాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం పేరుతో జగన్‌ ప్రభుత్వం రూ.700 కోట్లు ప్రజాధనం వృథా చేసిందని ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరగదని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అన్నా క్యాంటీన్లను త్వరగా తెరిపించి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడమే కాకుండా నామినేటెడ్‌ పదవులలో వారిని నియమిస్తామని చెప్పారు. నామినేటెడ్‌ పదవుల కేటాయింపులో జనసేన, బిజెపిలను కలుపుకొని సమన్యాయంగా ముందుకెళ్తామని చెప్పారు. అగనంపూడి వద్ద ఉన్న టోల్‌ గేటును నెల రోజులలోగా తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో విశాఖపట్నం ఎంపి ఎం శ్రీభరత్‌, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు.

➡️