కల్లుగీత కార్మికులపై కేసులు ఎత్తివేస్తాం – మద్యం వ్యాపారిలా జగన్‌

Apr 27,2024 22:50 #pawan kalyan, #speech

– ప్రజారాజ్యం విలీనానికి కారకుడు కన్నబాబు
– ప్రచార సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్‌ :కల్లుగీత కార్మికులపై అక్రమంగా తొమ్మిది వేల కేసులు పెట్టారని, కూటమి అధికారంలోకి రాగానే ఈ కేసులను ఎత్తివేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత తానే మద్యం వ్యాపారిలా జగన్‌మోహన్‌రెడ్డి మారిపోయారని విమర్శించారు. శనివారం రాత్రి కాకినాడ రూరల్‌ నియోజకవర్గం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో జరిగిన వారాహి విజయ భేరి ప్రచార సభల్లో పవన్‌ ప్రసంగించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రూ.41 వేల కోట్లను మద్యం ద్వారా అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. మిథున్‌రెడ్డి కంపెనీల నుంచి వస్తున్న నాసిరకం మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ముఖ్య కారకులు కన్నబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న డొక్కు స్కూటర్‌పై తిరిగిన వ్యక్తి, పిలిస్తే పరిగెత్తుకుని వచ్చే వ్యక్తి నేడు ఎమ్మెల్యే అయిన తరువాత అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాకలపూడిలో అక్రమ లే అవుట్ల వ్యవహారంలో అనేక మంది బాధితులు కన్నబాబు తీరుపై మండిపడుతున్నారన్నారు. ఎక్కడ లేఅవుట్లు వేసినా ఆయనకు భారీగా ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తుందని, కన్నబాబు, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చిరంజీవిని జగన్‌ అవమానిస్తే కనీసం కన్నబాబు స్పందించలేదని ధ్వజమెత్తారు. కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వడం కుదరదు అని జగన్‌ చెప్పినప్పుడు.. కన్నబాబు పక్కనే ఉన్నా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారన్నారు. ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుని కాకినాడ పార్లమెంటు వైసిపి అభ్యర్థి సునీల్‌ తన పక్కనే తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వంటి అక్రమార్కుల అంతు తేలుస్తానని హెచ్చరించారు. అందుకోసమే తాను ఈ జిల్లా నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. కూటమి బలపర్చిన జనసేన, టిడిపి, బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయన వెంట కాకినాడ పార్లమెంట్‌ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదరుశ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి తదితరులున్నారు.

➡️