నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం : తెలంగాణ సిఎం రేవంత్‌ 

Feb 15,2024 08:53 #CM Revanth Reddy, #Unemployment
We will solve the problems of the unemployed Telangana CM Revanth

కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేత

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో’నిరుద్యోగులారా అధైర్యపడకండి .. మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బుధవారం ఎల్‌బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13,444 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన యువత ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిఎంగా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో.. ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు అంతే సంతోషం కలుగుతోందన్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తామని చెప్పారు. స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించినా గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదని తెలిపారు. అధికారులతో సమీక్షించి అన్ని ఆటంకాలు తొలగించామన్నారు. ‘ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తూనే నాకు నిద్ర పడుతుంది. మీరంతా మా తమ్ముళ్లు.. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం’ అని అన్నారు. రాష్ట్రాన్ని సాధించుకున్న నిరుద్యోగ యువకుల కోసం పనిచేయడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పదేళ్లు ఈ బాధ్యతలోనే ఉండి యువత కోసం 24గంటలూ కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కెసిఆర్‌ మళ్లీ ఎలా అధికారంలోకి వస్తారో చూస్తా అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సిఎస్‌ శాంతి కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️