ఉద్యమ పదంతో కొత్త ఏడాదికి స్వాగతం

  • 21వ రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె
  • ఆట, పాట, వివిధ రూపాల్లో నిరసన

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వ తీరు ఫలితంగా కొత్త సంవత్సరం ప్రారంభం రోజునా అంగన్‌వాడీలు పోరుబాటలోనే ఉన్నారు. గత 21 రోజులుగా సమ్మెలో ఉన్నప్పటికీ వారి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఆట, పాటలు, వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కొత్త సంవత్సరానికి ఉద్యమ పదంతో స్వాగతం పలికారు. సమ్మె శిబిరాల్లో కేక్‌ కట్‌ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. వారి పోరాటానికి సిపిఎం, సిపిఐ, సిఐటియు, ఎఐటియుసి నాయకుల మద్దతు తెలిపారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీలు కోలాటం, పెందుర్తిలో కబడ్డీ, కోలాటం ఆడారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, బుచ్చయ్యపేటల్లో కోలాటం, ఆటపాటలు, సోది, వీధి వేషాలతో నిరసన తెలిపారు. మునగపాక సమ్మె శిబిరంలో కేక్‌ కట్‌ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. నర్సీపట్నంలో ముగ్గులు వేసి నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మండలాల్లో సమ్మె శిబిరాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. కొయ్యూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. విఆర్‌.పురంలో దీక్షా శిబిరం వద్ద ముగ్గులు వేశారు.

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో మహిషాసుర మర్ధిని వేశధారణలో నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ ఎదుట కోలాటం, శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి, హిందూపురం, చిలమత్తూరు, పెనుకొండ, మడకశిరలోకోలాటం, కబడ్డీ ఆడారు. కర్నూలోని ధర్నా చౌక్‌లో మ్యూజికల్‌ చైర్స్‌ ఆడి, ఆదోనిలో కబడ్డీ ఆడి, నంద్యాల జిల్లాలో ఆట, పాట, కోలాటంతో నిరసన తెలియజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో న్యూ ఇయర్‌ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. తిరుపతిలో సాష్టాంగ నమస్కారం చేస్తూ నిరసన తెలిపారు. రేణిగుంటలో సమ్మె శిబిరంలో న్యూ ఇయర్‌ వేడుక జరుపుకున్నారు. ‘లేచింది మహిళా లోకం’ పాటకు స్టెప్పులతో దుమ్ములేపారు. నెల్లూరులో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారులు వారితో జతకలిసి సంఘీభావం తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో అంగన్‌వాడీలు ఉద్యమ గీతాలకు నృత్యాలు చేశారు. వారి పోరాటానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఐక్యంగా ఉండి సమ్మె కొనసాగించాలని సూచించారు. సమ్మె చేపట్టి 21 రోజులైన సందర్భంగా తెనాలిలో 21 సంఖ్య ఆకారంలో అంగన్‌వాడీలు కూర్చుని నిరసన తెలిపారు. కొల్లిపర శిబిరంలో కోలాటం, క్రికెట్‌ ఆడారు. ఫరంగిపురంలో ‘చెడు వినవద్దు… చెడు కనవద్దు… చెడు చూడవద్దు’ అనే సంకేతాలతో నిరసన తెలిపారు. తుళ్లూరులో కబడ్డీ ఆడారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో చప్పట్లు కొట్టి, కబడ్డీ ఆడి, పిడుగురాళ్లలో సమ్మె శిబిరం వద్ద ముగ్గులు వేసి వివిధ రకాల ఆటలతో నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, కాళ్ల, పోడూరు, నరసాపురం, గణపవరం, ఉండి, మొగల్తూరు, పాలకొల్లు, పెనుగొండ, పాలకోడేరు తణుకు, ఆచంటలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు. పెనుమంట్రలో ఆటపాటలతో, వీరవాసరంలో చీపురు పట్టి రోడ్లు ఊడుస్తూ, ఏలూరు జిల్లాలో భీమడోలు, జీలుగుమిల్లిలో ఆటపాటలతో, కొయ్యలగూడెంలో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా పెదపూడిలో ప్రభుత్వ విధానాలపై నృత్యరూపకం ప్రదర్శించారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట బైటాయించారు. ఆట, పాట, కబడ్డీ, కోలాటం, పొర్లుదండాలతో, ఒంటి కాలుపై, మోకాళ్లపై నిల్చుని నిరసనలు తెలిపారు. కొత్త సంవత్సరంలోనైనా ముఖ్యమంత్రి మనసు మారి తమ వేతనాలు పెంచాలని కోరుతూ అంగన్‌వాడీ, ఆయాలు విజయనగరం కలెక్టరేట్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి, సోది చెప్పారు. జామిలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గజపతినగరంలో కోలాటం ఆడారు. పార్వతీపురంలో రంగవల్లులు వేసి, శ్రీకాకుళంలో జోస్యం చెప్తూ, కబడ్డీ ఆడి, టెక్కలిలో ఆట, పాటలతో నిరసన తెలిపారు.

అణచివేతలు కొత్తేం కాదు : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి

అంగన్‌వాడీలకు ఉద్యమాలు, అణచివేతలు కొత్తేమీ కాదని, ఉమ్మడి రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ బెదిరింపులను ఎదుర్కొని ఎన్నికల్లో ఆ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి గుర్తు చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షమంది అంగన్‌వాడీలు ఉన్నారని, ఇంటికి మూడు ఓట్లు చొప్పున మూడు లక్షల ఓట్లు మళ్లిస్తే ప్రభుత్వం తారుమారవుతుందని హెచ్చరించారు.

ప్రభుత్వం మొండిపట్టు వీడాలి : ఉమామహేశ్వరరావు

ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా అంగన్‌వాడీల సమ్మెను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బాపట్లలో అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి వారి పోరాటానికి మద్దతు తెలిపారు.

 

➡️