ఇంటి వద్దకే సంక్షేమం : రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Feb 6,2024 09:01
  • ఉభయసభల సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌
  • బహిష్కరించిన టిడిపి సభ్యులు
  • అసత్యాలు చెబుతున్నారని ఆరోపణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. పెద్ద ఎత్తున అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం జరిగిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నుద్ధేశించి ప్రసంగించారు. నీతి ఆయోగ్‌ ప్రచురించిన చర్చాపత్రంలో ఎపిలో ప్రాథమిక పేదరిక గణన నిష్పత్తి 2015-16లో 11.77 శాతం ఉండగా, 2022-23 నాటికి 4.10 శాతానికి తగ్గిందని అంచనా వేసినట్లు తెలిపారు. అంతకుముందు శాసనసభ వద్దకు వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, ఉభయ సభల అధిపతులు స్వాగతం పలికారు. అనంతరం దాదాపు రెండుగంటల పాటు గవర్నర్‌ ప్రసంగం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను గవర్నర్‌ వివరించారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే టిడిపి సభ్యులు తమ సీట్ల వద్దనుండి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోందని, అబద్దాలు చదవవద్దని కోరారు. మెగా డిఎస్‌సి తదితర అంశాలను వారు ప్రస్తావించారు. టిడిపి సభ్యులు నిరసన మధ్య గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నందమూరి బాలకృష్ణతో పాటు మరికొందరు తమ సీట్ల నుండి ముందుకొచ్చి వాస్తవాలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. కీలకమైన పోలవరాన్ని ఈ ప్రభుత్వం అటకెక్కించిందని, నాడు-నేడు స్తంభించిపోయిందని, మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని నినాదాలు చేశారు. ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సభ నుండి వెళ్లిపోయారు. అనంతరం అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ ఇంటివద్దకే అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాసం 22.42 శాతం పూర్తయిందని, ప్రాజెక్టు పనులు 74.01 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడిగా రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ఆరేళ్లుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా పునరావాసం విషయంలో వెనుకబడ్డ అంశాన్ని గవర్నర్‌ ప్రస్తావించారు. ప్రాజెక్టుతోపాటు ఆర్‌ఆండ్‌ఆర్‌ పనులను కూడా పూర్తిచేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రూ.1,977 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ జమచేశామని పేర్కొన్నారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు నవరత్నాల ద్వారా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉపాధి, విద్య, ఉద్యోగం, పారిశ్రామికాభివృద్ధిలో పురోగతి సాధించామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చామని, ఈ రంగంలో ప్రవేశపెట్టిన పథకాల కోసం రూ.73,417 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల వల్ల విద్యలో గణనీయమైన వృద్ధిని సాధించామని పేర్కొన్నారు. పాఠశాలల్లో సదుపాయాలకు రూ.7,163 కోట్లతో ఆధునీకరణ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. హార్టీకల్చర్‌ సాగును పెంచుతున్నామని, పండ్ల ఉత్పత్తిలో మెరుగైన స్థానానికి చేరుకున్నామని వివరించారు. ఆయిల్‌పామ్‌, బొప్పాయి. నిమ్మ, కొబ్బరి, కోకో, టమోటా, మిర్చి ఉత్పాదనలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉందని వివరించారు. మామిడి, కమల, జీడిపప్పులో రెండోస్థానంలో ఉందని వివరించారు. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత అద్దె వ్యవస్థ ద్వారా 880 బస్సులను ప్రవేశపెట్టామని వివరించారు. పట్టణాల్లో 2000 ఎంఎల్‌డి నీటిని అందిస్తున్నామని వివరించారు. నగరాలను అభివృద్ధి చేయాలనే కేంద్ర ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌లో భాగంగా విశాఖపట్నాన్ని గ్రోత్‌హబ్‌గా మార్చామని వివరించారు. విద్యుత్‌ రంగంలో పంపిణీ సంస్థలకు ఇప్పటి వరకు రూ.48,175 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష నగదు బదిలీ పథకాల ద్వారా రూ.4,21,094 కోట్లను అందించామని పేర్కొన్నారు. 7000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కోసం సెకీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. మైనార్టీల కోసం కల్యాణమస్తు, షాదీతోఫా వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద రూ.1366 కోట్లు ఇస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. 53 లక్షల మంది రైతులు 33,300 కోట్లు నేరుగా లబ్దిపొందారని వివరించారు. 56 నెలల్లో రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నామని, 311 మెగా పరిశ్రమలు స్థాపించామని తెలిపారు.

8 వరకు అసెంబ్లీ

  • బిఎసిలో నిర్ణయం
  • టిడిపి బహిష్కరణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : శాసనసభ సమావేశాలను 8 వ తేది వరకు (నాలుగు రోజులు) నిర్వహించాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సభ్యులు బహిష్కరించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనసభాపక్షనేత జగన్మోహన్‌రెడ్డి, సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌, మంత్రులు పెద్దిరెడ్డి, జోగి రమేష్‌, విప్‌ ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోతేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, ఏడోతేదీన ఓన్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎనిమిదోతేదీన దీనిపై చర్చించి ఆమోదం తీసుకోనున్నారు. తొలుత మూడు రోజులు జరపాలని అనుకున్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో ఒకరోజు పొడిగించినట్టు అధికారపక్ష సభ్యులు తెలిపారు. ఏడోతేదీ ఉదయం సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఓన్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

➡️