బాబు చేసింది సున్నా!

Feb 26,2024 21:42 #ap cm jagan, #krishna water, #kuppam
  • శాంతిపురం సభలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • ‘కుప్పం’కు కృష్ణా జలాలు విడుదల
  • 57 నెలల్లో చెప్పింది చేశామని ప్రకటన

ప్రజాశక్తి – రామకుప్పం, శాంతిపురం (చిత్తూరు జిల్లా) : ’14 సంవత్సరాల పాలనలో చంద్రబాబు రాష్ట్రాని, కుప్పం నియోజకవర్గానికి చేసింది ఏంటంటే ఒకే ఒక పెద్ద సున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా తరలించిన కృష్ణా జలాలకు సిఎం జగన్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుప్పం బ్రాంచ్‌ కాలువకు నీటిని విడుదల చేశారు.మరింత నీటి స్టోరేజి కోసం సాగు, తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్‌పెట్టేలా రూ.535 కోట్లతో మరో ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించేలా రెండు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం శాంతిపురం గుండుశెట్టిపల్లెవద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘5 ఏళ్లపాటు ఎంఎల్‌ఎగానూ, 14 ఏళ్ల పాటు సిఎంగానూ పనిచేసిన బాబు సొంత నియోజకవర్గానికి కృష్ణానీటిని తీసుకురాలేదు. మీ బిడ్డ జగన్‌ కేవలం 57 నెలలో తీసుకు వచ్చాడు’ అని చెప్పారు. ‘ కొండలు, గుట్టలు దాటుకుని 672 కిలోమీటర్ల పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించడాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి.’ అని అన్నారు. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచి కెనాల్‌ ఆయనకు ఆదాయ వనరుగా ఉంటే,తమ ప్రభుత్వ హయంలో ప్రజలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు చేశామన్నారు. 2022, సెప్టెంబర్‌ 23న కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. కుప్పంలో 87,941 కుటుంబాలు ఉంటే తన 58 నెలల పాలనలో 82,039 కుటుంబాలకు 93.29శాతం ప్రయోజనం జరిగిందన్నారు. కుప్పం నియోజకవర్గానికి ఎవరివల్ల మేలు జరిగిందో ఆలోచించాలని కోరారు. సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ప్రజలు ఆయన్ను ఓడిస్తే, కుప్పానికి వచ్చి ధనబలంతో బిసి సీటును కబ్జా చేసి నియంతలా కొనసాగుతున్నారన్నారు. 35 ఏళ్లు గెలిచిన కుప్పంలో కనీసం ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు రాకపోవడం దారుణమన్నారు.

భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తా

కుప్పం నుండి వైసిపి అభ్యర్ధి భరత్‌ను గెలిపిస్తే, మంత్రి పదవి ఇస్తానని జగన్‌ చెప్పారు. ‘ఎంఎల్‌సి భరత్‌ను కుప్పం ఎంఎల్‌ఎగా ఎన్నుకోండి.. ఎంఎల్‌సిగా ఉండే ఎంతో చేశారు. ఎంఎల్‌ఎగా మీరు గెలిపిస్తే నా క్యాబినెట్‌లో మంత్రిని చేస్తా..’ అని ఆయన అన్నారు. తద్వారా కుప్పంకు మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానన్నారు. రంగురంగుల మానిఫెస్టోలు చూసి మోసపోవద్దని చెప్పారు.

సిఎంకు ఘన స్వాగతం

ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 11.05 గంటలకు రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి డిప్యూటీ సిఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట, చిత్తూరు ఎంపిలు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, ఎన్‌.రెడ్డెప్ప, ఎంఎల్‌సిలు భరత్‌, సిపాయి సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌, కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌, ఎస్‌పి జాషువా పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

➡️