స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ కళ్యాణ్‌ వైఖరి ఏమిటి..?

కార్మిక సంఘాలను కించపర్చేలా వ్యాక్యలు చేయడం సరికాదు : సిపిఎం

ప్రజాశక్తి-అనకాపల్లి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర సందర్భంగా ఆదివారం అనకాపల్లిలో చేసిన ప్రసంగం స్పష్టతలేకుండా మరింత అయోమయం సృష్టించేదిగా వుందని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ పేర్కొంది. ఈ మేరకు సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాధం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయమై తమ వైఖరిని వెల్లడించకుండా ప్లాంట్‌ను ప్రైవేటీకరించే మోడీని భుజానెత్తుకొని మోస్తున్నట్లు మాట్లాడారని తెలిపారు. ప్రధాన మంత్రి దగ్గరికి రమ్మటే కార్మిక సంఘాలు ఎవరూ రాలేదని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలపై నిందవేసేలా మాట్లాడడం సరైనదికాదన్నారు. గత మూడేళ్ళగా స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటాలు పవన్‌కళ్యాణ్‌కు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రితో తనకు అత్యంత సాన్నిహిత్యం వుందని చెప్పుకున్న పవన్‌ కళ్యాణ్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మోద్దని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.  స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ పట్ల మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది, లేనిది ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంట్‌లో మాట్లాడడానికి సిఎం రమేష్‌ లాంటి వ్యక్తులు ఉండాలని చెప్పడమంటే ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఏనాడు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, సొంత గనులు కేటాయింపుపై సిఎం రమేష్‌ మాట్లాడిన దాఖలాల్లేవని వెల్లడించింది.

జిల్లాలో ప్రధాన అంశాలేవి ప్రస్తావించకుండా విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, సిపిఎస్‌ రద్దు వంటి అశాలపై తన వైఖరిని వెల్లడించకుండా తప్పదాటు వైఖరిని ప్రదర్శించారని మండిపడ్డారు. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీకి గొంతుకోసింది టిడిపి ప్రభుత్వమే మరలా టిడిపి కూటమి అధికారంలోకి వస్తే తెరిపిస్తామని చెప్పడం దగా చేయడం తప్ప మరొకటికాదన్నారు. ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్దరణకై ప్రస్తావనలేదన్నారు. అనకాపల్లి పట్టణ ప్రజలను, పట్టిపీడిస్తున్న, వేదిస్తున్న దోమల సమస్యకు కారణమైన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సమస్య పరిష్కారంపై అసలు ప్రస్తావనే చేయకపోవడం పట్టణ ప్రజలను విశ్మరించడమేనని అన్నారు. చెరుకు రైతులకు మద్ధతు ధర, ప్రోత్సాహక ధర చెల్లింపుల విషయంపై భరోసా ఇవ్వకుండా బెల్లానికి మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పడంలో మోసం తప్ప చిత్తశుద్ధి లేదన్నారు.
గత టిడిపి ప్రభుత్వ విధానాలతో ఏర్పడిన సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పడమంటే ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటికాదన్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఆడుతున్న నాటకాలను గుర్తించి రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం విజ్ఞప్తి చేసింది.

➡️