8న విద్యుత్‌పై శ్వేతపత్రం

  • అధికారులతో సిఎం సమీక్ష

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ రంగంపై ఈ నెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అంశంపై ఇంధనశాఖ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. పదేళ్లలో విద్యుత్‌ రంగంలో జరిగిన, తీసుకొచ్చిన సంస్కరణలు, ఇతర అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గత ఐదేళ్లలో ప్రజలపై వేసిన భారాలు, విద్యుత్‌ కొనుగోళ్లపై ఆరా తీశారు. విద్యుత్‌ రంగంలో అప్పులు పెరిగిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బయట మార్కెట్‌లో విద్యుత్‌ కొనడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో అప్పులు పెరిగాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవడంతో బయట నుంచి అప్పులు తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు. అప్పులు, ప్రజలపై వేసిన భారాలు, విద్యుత్‌ కొనుగోలు అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌, జెన్‌కో ఎమ్‌డి కెవిఎన్‌ చక్రధరబాబు, డిస్కమ్‌ల సిఎమ్‌డిలు ఐ పృథ్వీతేజ్‌, కె సంతోషరావు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి భార్య తీరుపై సిఎం ఆగ్రహం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి భార్య పోలీసులతో వ్యవహరించిన తీరుపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పోలీసుల పట్ల మర్యాదతో మసులుకోవాలని హెచ్చరించారు. సోమవారం మంత్రి భార్య ఎస్‌ఐ పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు, అవమానకరంగా వ్యవహరించారు. ఎటువంటి ఫ్రొటోకాల్‌ లేని ఆమె తీరు సరికాదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్లో మంత్రిని హెచ్చరించారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

➡️