బిసి రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయి? 

Mar 7,2024 09:45 #BC Welfare, #reservations, #TDP
  • టిడిపి డిక్లరేషన్‌తో చర్చ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిసిల రిజర్వేషన్‌ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా టిడిపి ప్రకటించిన బిసి డిక్లరేషన్‌తోఈ చర్చ ప్రారంభమైంది.2019 స్థానిక సంస్థల ఎన్నికల ముందు బిసిలకు 34 శాతం రిజర్వేషన్లతో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని వైసిపి ప్రభుత్వం జిఓ నెంబరు 176ను జారీ చేసింది. దీనిపై అప్పట్లో టిడిపి అనుబంధ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి, బిసి నాయకులు బిసి రామాంజనేయులు కోర్టులో కేసులు వేశారు. ప్రతాపరెడ్డి సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవు పిటీషన్‌ 1314 దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం ఎన్నికలు జరపాలని కోరారు. అసెంబ్లీలో జరిగిన చర్చల్లో బిసి రామాంజనేయులు, బిర్రు ప్రతాపరెడ్డి తెలుగుదేశం నాయకులని ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ సాక్షిగా చెబితే వారిద్దరూ వైసిపి నాయకులేనని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పత్రికాముఖంగా ప్రకటించారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున చర్చ కూడా నడిచింది. బిసిలకు రిజర్వేషన్లు పెంచామని చెప్పి అమలు చేయకుండా అడ్డుకోవాలనే దురుద్దేశంతో వైసిపి నాయకులే వెనకుండి కేసులు వేయించారని టిడిపి నాయకులు తెలిపారు. అదే సమయంలో టిడిపి నాయకులే రిజర్వేషన్లను సహించలేక కోర్టులో పిటీషన్లు వేయించారనీ వైసిపి నాయకులు వాదించారు. ఈ పిటిషన్లపై చారణ జరిపిన సుప్రీం కోర్టు 176 జిఓ అమలుపై స్టే ఇచ్చి హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు 176 జిఓ ప్రకారం ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లవని, 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని సూచించింది. దీంతో బిసిలకు కేటాయించిన రిజర్వేషన్లను తగ్గించారు. రిజర్వేషన్లు పెంచిన సమయంలోనే అది అమలు సాధ్యం కాదని, మండల్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని టిడిపి నాయకులు వాదించారు. కేవలం బిసిలను మోసం చేసేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీనే బిసి డిక్లరేషన్లో రిజర్వేషన్లను పెంచుతామని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

➡️