ఎంపి పదవికి, టిడిపికి రాజీనామా చేస్తా- కేశినేని నాని

Jan 6,2024 21:58 #mp kesineni nani, #TDP

ప్రజాశక్తి – విజయవాడ :తెలుగుదేశం పార్టీకి, తన ఎంపి పదవికి రాజీనామా చేస్తామని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ (నాని) ప్రకటించారు. త్వరలోనే లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తానని తెలిపారు. ఆ వెంటనే టిడిపికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. ఎన్‌టిఆర్‌ జిల్లా చందర్లపాడు మండలంలో వైసిపి నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావుతో కలిసి ఆయన శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గన్నారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ… ”టిడిపికి రాజీనామా చేస్తున్నా.. లోక్‌సభ స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కోరాను.. ఆయన అపాయింట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు ఢిల్లీ వెళ్లి ఎంపి పదవికి.. ఆ తర్వాత టిడిపికి రాజీనామా చేస్తా” అని పేర్కొన్నారు. అనంతరం తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కొందరు వ్యక్తులు తన కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.కేశినేనిని బుజ్టగించేందుకు కనకమేడల రాయబారం ఎంపి కేశినేనిని బుజ్జగించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నించారు. టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్‌ను ఆయన వద్దకు పంపారు. అయితే, కేశినేని అలక వీడేందుకు నిరాకరించినట్లు తెలిసింది. ”స్వయంగా అధినేత చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పిన తర్వాత రాయబారాలెందుకు? మాట్లాడేదేముంటుంది” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడతారని ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.

➡️