నిర్వాసితులను వెలిగొండలో ముంచుతారా ? : సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రశ్న

Mar 3,2024 10:46
  • అసంపూర్తి ప్రాజెక్టు ప్రారంభం ఎన్నికల స్టంటే

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోఎనిమిది వేల కుటుంబాలకు పునరావాసం ఇవ్వకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రాజెక్టు ఫీడర్‌ కెనాల్‌ పూర్తికాలేదని, వదలడానికి శ్రీశైలంలో నీళ్లూలేవని, ఇది ఎన్నికల స్టంటు తప్ప మరొకటి కాదని అన్నారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలను మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా ప్రజల కలల పంటగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు గత 40 సంతవ్సరాలుగా సాగుతూనే ఉందని, పదేపదే గడువులు పెట్టినా పూర్తిచేయని పాపం గత తెలుగుదేశం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలదేనని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా ప్రాజెక్టు పూర్తయిందని ఊరిస్తూనే ఉందని, నిధులు ఇవ్వకపోవడం, పునరావాసం పూర్తి చేయకపోవడం వల్ల ఇది దీర్ఘకాలం పెండింగ్‌లో ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు నిత్యం కరువువాత పడుతూనే ఉన్నారని, వలసలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి పాలకులు తప్పించుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి నిధులు కేటాయించి వచ్చే ఖరీఫ్‌ నాటికి ప్రజలకు నీళ్లు అందబాటులోకి తీసుకురావాలని, ఈలోపు పునరావాసం పూర్తిచేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరుపున డిమాండు చేశారు.

➡️