ఓటింగ్‌ శాతం పెరుగుతుందా !

May 10,2024 23:07 #Voting

-రాష్ట్రంలో 20 ఏళ్లుగా అదే ట్రెండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సోమవారం జరగనున్న పోలింగ్‌ ప్రక్రియలో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీకి, పార్లమెంటుకు కలిపి ఎన్నికలు జరుగుతుండటం దీనికి ఒక కారణం కాగా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం కూడా మరో కారణం. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పోటాపోటీ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో చావోరేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. అభ్యర్థులు ఎలక్షనీరింగ్‌పై పెద్దఎత్తున దృష్టిపెడుతున్నారు. యువత, మహిళల్లో ఓటింగ్‌ పట్ల పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది ఎన్నికల కమిషన్‌ కూడా పోలింగ్‌ పర్సంటేజ్‌ పెంచేందుకు వివిధ రూపాల్లో కృషిచేస్తోంది. వీటన్నింటికి తోడు గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. వీటన్నింటి ఫలితంగా పోలింగ్‌ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గడిచిన 20 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల్లోనూ పోలింగ్‌ శాతం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. రాష్ట్ర విభజన తరువాత కూడా ఇదే ఒరవడి కొనసాగింది. గత ఎన్నికల్లో 79.64శాతం ఓట్లు పోల్‌ కావడంతో తాజా ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ సులభంగా జరుగుతుందని, 85 శాతం దాకా చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పోలింగ్‌ కోసం ప్రచారం
ఓటు వేసే చైతన్యం ఓటర్లలో పెంచేందుకు వివిధ రూపాల్లో ప్రచారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతోంది, మీడియాతో పాటు, సోషల్‌ మీడియాలోనూ ఈ ప్రచారం సాగుతోంది. ఎన్నికల కమిషన్‌ కూడా వివిధ రూపాల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రచారం చేస్తోంది. వీటికితోడు పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వివిధ సామాజిక సంస్థలు ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నాయి. వ్యాపారులు, హాస్పటల్స్‌, ఇతర వర్తకులు కూడా ఓటుహక్కు వినియోగించుకున్నవారికి
ఉచిత/రాయితీపై సేవలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా సాగుతున్న ప్రచారం సానుకూల ఫలితం చూపుతుందని భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఓటింగ్‌ సరళి

సంవత్సరం      మొత్తం ఓట్లు                          పోలైన ఓట్లు                   పర్సంటేజ్‌               పెరుగుదలశాతం
2004             5,14,6,490(ఉమ్మడి ఎపి)    3,57,80,385 69.96    0.81(1999 ఎన్నికలతో పోల్చితే)
2009              5,78,92,259                         4,20,96,866              72.72                         2.76
2014               3,67,6,839(విభజిత ఎపి)       2,87,95,269           78.41                            5.69
2019               3,9,40,537                          3,16,80,063           79.64                                 1.23

➡️