నయా ఉదారవాద విధానాలతో…దేశంలో ఉపాధి ధ్వంసం

Dec 30,2023 21:50 #Prabhat Patnaik, #speech

– స్థూల జాతీయోత్పత్తి రేటు పెరిగినా నిరుద్యోగం తగ్గలేదు

– ఎన్‌పిఆర్‌ స్మారకోపన్యాసంలో ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో:దేశంలో నయా ఉదారవాద విధానాలు ప్రారంభమైనప్పటి నుంచి స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు పెరిగినా ఉపాధి రేటు దేశంలో గణనీయంగా పడిపోయిందని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, వ్యవసాయ భూమి రియల్‌ ఎస్టేట్‌కు తరలిపోయి చిన్న చిన్న ఉత్పత్తి సంస్థలు నాశనం కావడంతో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని ప్రముఖ ఆర్థిక వేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి నండూరి ప్రసాదరావు (ఎన్‌పిఆర్‌) 23వ వర్థంతి సందర్భంగా ‘ప్రపంచీకరణ-నిరుద్యోగం- పరిష్కార మార్గాలు’ అనే అంశంపై విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యాన సెమినార్‌ నిర్వహించారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో ముందుగా ఎన్‌పిఆర్‌ చిత్రపటానికి ప్రభాత్‌పట్నాయక్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, కుమార్‌, మణి, కెఎం.శ్రీనివాస్‌, డాక్టర్‌ బి.గంగారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాత్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ ఎన్‌పిఆర్‌ గొప్ప విప్లవకారుడు, కార్మికపక్షపాతి అని అన్నారు. ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా జీవితకాలంలో సంఘటిత, అసంఘటిత రంగంలో ఉద్యమాలకు నాయకత్వం వహించిన గొప్ప నాయకుడని కొనియాడారు.ఐదేళ్లలో ఉపాధి సున్నా…గడచిన ఐదేళ్లలో దేశంలో పనిచేయగల కార్మికులు, దేశ జనాభా గణనీయంగా పెరిగినా ఉపాధి రేటు సున్నా అని తెలిపారు. 1991లో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుంచి 2019 వరకూ ఉపాధి రేటు ఒక శాతమేనని, జనాభా పెరుగుదల రేటు రెండు శాతంగా ఉందని వివరించారు. ఈ విధానాలతో వ్యవసాయ భూమి రియల్‌ ఎస్టేట్‌లోకి లక్షల ఎకరాలు వెళ్లిపోయి గ్రామీణ ప్రాంతంలో కూలీల ఉపాధిని, వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాథమిక పెట్టుబడి సంచయం (ప్రిమిటివ్‌ ఎక్కుమిలేషన్‌ ఆఫ్‌ కేపిటల్‌)తో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ భూమి రియల్‌ ఎస్టేట్‌కు తరలిపోయి, చిన్న, సన్నకారు రైతులు కుదేలయ్యారని తెలిపారు. దేశంలో నోట్ల రద్దు, జిఎస్‌టి అమలుతో చిన్న ఉత్పత్తిదారులపై పన్నుల భారం పెరిగి ఉద్యోగాల కల్పన దెబ్బతిందన్నారు. చిన్న చేపను పెద్ద చేపలు మింగేసినట్టుగా చిన్న వ్యాపారాలను అదానీ, అంబానీలాంటి వారు మింగేశారని తెలిపారు. దేశంలోకి ప్రపంచం నలుమూలల నుంచి సరుకుల ప్రవాహం పెరిగి జిడిపి 8 శాతానికి వెళ్లినా ఉపాధి రేటు కేవలం ఒక శాతమేనని తెలిపారు. ఉపాధి పెరగాలంటే దేశంలో సంపన్నులపై ఒక శాతం పన్ను వేయాలన్నారు.ప్రయివేటీకరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో న్యాయవ్యవస్థ లేదు ప్రభుత్వ రంగాన్ని బడా పెట్టుబడిదారులు కొల్లగొట్టిన కారణంగా చిన్న ఉత్పత్తి సంస్థలు ధ్వంసమై పెద్ద ఎత్తున దేశంలో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్నా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో న్యాయవ్యవస్థ లేదన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు ప్రజామోదం లేదని తెలిపారు. ఇలాంటి భారీ పరిశ్రమను ప్రజల సంపదగా చూడాలని, ఎగ్జిక్యూటివ్‌ నిర్ణయాలతో ప్రయివేటుపరం చేయకూడదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలో ఐదు ప్రధాన ఆర్థిక హామీలను చేర్చేందుకు ప్రజాపోరాటాలు జరగాలని ప్రభాత్‌పట్నాయక్‌ సూచించారు. అందరికీ ఆహారం, విద్య, నాణ్యతగల వైద్యం, ప్రతి ఒక్కరికీ ఉద్యోగ హక్కు, సార్వత్రిక వృద్ధాప్య పింఛను కోసం సిఐటియు అజెండా రూపొందించి ప్రజా చైతన్యం కలిగించాల్సి ఉందని తెలిపారు. కార్మికపోరాటాల్లో కీలక పాత్ర: సిహెచ్‌.నరసింగరావునండూరి ప్రసాదరావు (ఎన్‌పిఆర్‌) 1930వ దశకంలోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గన్న యోధులని, 1940లో ఆలిండియా కిసాన్‌ సభకు అధ్యక్షుడిగా చురుకైన పాత్రపోషిస్తూ విశాఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యమ నిర్మాణం, కార్మికోద్యమాల్లో కీలక పాత్ర పోషించారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రంలోనూ జరుగుతోన్న పరిణామాలు, పరిస్థితులపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. పాలకవర్గాల భావజాలంలో జనం కొట్టుకుపోకుండా, ఈ నయా ఉదారవాద విధానాల ‘చట్రం’ నుంచి బయటపడేసే సమిష్టి భావజాల రంగంలో ప్రత్యామ్నాయం కోసం పోరాటాలు సాగాలన్నారు.

➡️