మెయిన్‌ లైన్లో ఆగిన యశ్వంత్‌పూర్‌కారటగి ఎక్స్‌ప్రెస్‌

Jan 1,2024 08:18 #karnool, #train jom

-రైలుఇబ్బంది పడ్డ ప్రయాణికులు

ప్రజాశక్తి-రాయదుర్గం :యశ్వంతపూర్‌ నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజూ తిరిగే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం వేకువజామున 4:40 గంటలకు రాయదుర్గం రైల్వేస్టేషన్‌లో 1వ నెంబర్‌ ప్లాట్‌ఫారం చేరుకోవాల్సి ఉండగా మధ్యలో ఉన్న మెయిన్‌ లైన్‌ మీద ఆగిపోయింది. 1, 2 ప్లాట్‌ ఫారాలపై అప్పటికే గూడ్స్‌ రైళ్లు ఆగి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మెయిన్‌ లైన్‌లో ఆపినట్లు స్టేషన్‌ మాస్టర్‌ ధర్మతేజ తెలిపారు. దీంతో ఎటువైపు దిగాలో తెలియక ప్రయాణికులు కాసేపు తికమక పడి అటువైపు కొందరు, ఇటువైపు కొందరు దిగి, గూడ్స్‌ రైళ్ల మధ్య సందుల్లో నడుచుకుంటూ వెళ్లారు. మహిళలు చిన్న పిల్లలను, లగేజీని అతికష్టం మీద మోసుకుంటూ వచ్చారు. దీనిపై స్టేషన్‌ మాస్టర్‌ వివరణ ఇస్తూ పుట్టపర్తి రైలు మార్గంలో సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్న దృష్ట్యా ఆ మార్గం మీద ప్రయాణించే గూడ్స్‌ రైళ్లు కూడా రాయదుర్గం-బళ్లారి- చిక్కజాజూరు మార్గం మీదుగా మళ్లించడంతో సగటున రోజుకు 30 వరకూ గూడ్స్‌ రైళ్లు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఇంజన్‌ మొరాయించడంతో ఓబుళాపురం స్టేషన్‌ ఫ్లాట్‌ఫారంపై గూడ్స్‌ రైలు ఆగిపోయిందన్నారు. కారటిగి-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాయదుర్గం స్టేషన్‌కు వచ్చేసరికి రెండు ప్లాట్‌  ఫారాలలో రెండు గూడ్స్‌ రైళ్లు ఆగి ఉండడంతో రైలును సకాలంలో గమ్యస్థానం చేర్చాలనే ఉద్దేశంతో స్టేషన్‌ మధ్యలో ఉన్న మెయిన్‌ లైన్‌లో ఆపినట్లు తెలిపారు. మొలకల్మూర్‌ స్టేషన్‌లో ఆపితే రెండు గంటలు ఆలస్యంగా రాయదుర్గం వచ్చేదన్నారు. ప్రయాణికులు ఎక్కి దిగేందుకు రాయదుర్గంలో రైలును అదనంగా 15 నిమిషాలు ఆపినట్లు తెలిపారు.

➡️