పవన్ ప్రసంగంపై వైసిపి నేతల కామెంట్స్

Feb 29,2024 13:54 #pavan kalyan, #YCP Leaders
ycp leaders on pavan kalyan

ప్రజాశక్తి-యంత్రాంగం : బుధవారం జరిగిన టిడిపి-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంఫై వైసిపి మంత్రులు, ఎంపీలు విమర్శల వర్షం గుప్పించారు. విశాఖలో మీడియా సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ… పవన్ ఫ్రస్టేషన్ పిక్స్ కి చేరిందని ఎద్దేవా చేశారు. జగన్, పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, రెండు పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని  బలోపేతం చేయకుండా తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేసారని అన్నారు. తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడు. చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారు. నాకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ కళ్యాణ్ ఒక జాతిని అవమానించినట్లే. పవన్ కళ్యాణ్‌కి స్వేచ్ఛ లేదు. నిన్న జరిగిన జెండాని సభకి జెండా లేదు’ అని అన్నారు.

అమరావతి అందరి రాజధాని కాదని, కొందరికే రాజధాని అనే పవన్ అంటున్నారని  పేర్ని నాని తెలిపారు. అమరావతి ఒక కులానికి రాజధాని అని అంటున్న పవన్ కళ్యాణ్ నాటికీ, నేటికీ ఏమ మారిందో చెప్పాలని ప్రశ్నించారు. 2014, 19 ఎన్నికల్లో కూడా పవన్ జగన్ కు వ్యతిరేకంగానే పనిచేస్తారని పేర్ని నాని పేర్కొన్నారు.  తమకు ఎందుకు ఓటు వేయాలో చంద్రబాబు, పవన్ సభలో ఎక్కడ ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

➡️