మరో అవకాశం కోసం ఎమ్మెల్యేల క్యూ

Dec 28,2023 08:46 #YCP Leaders
ycp leaders protest at cmo

రీజనల్‌ కో-ఆర్డినేటర్లతో సిఎం భేటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై వైసిపిలో ఎడతెగని చర్చ నడుస్తోంది. మొదటి విడతలో 11 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను మారుస్తూ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై క్షేత్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవ్వడంతో మలివిడత జాబితాను ప్రకటించేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో మొదట చేపట్టిన కసరత్తును మరోసారి వడపోసేందుకు వైసిపి చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా సిఎం జగన్‌ పార్టీ రీజనల్‌ కో-ఆర్డినేటర్లందరితో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోద్య రామిరెడ్డి, మిథున్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు నియోజకవర్గాల్లో వైసిపి నియోజక ఇన్‌ఛార్జుల మార్పుపై కసరత్తు చేసినట్లు తెలిసింది. దాదాపు 60 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను ఖరారు చేసినట్లు సమాచారం. ఓ వైపు రీజనల్‌ కో-ఆర్డినేటర్‌లతో సమావేశం జరుగుతుండగానే పలువురు ఎమ్మెల్యేలు తమకు మరోసారి అవకాశం కల్పించాలని కోరేందుకు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు. విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తదితరులు క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని సీటు మార్పు విషయంపై ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించినట్లు తెలిసింది. బుధవారం నాడు కొలిక్కి వచ్చిన జాబితాలోని ఇన్‌ఛార్జులతోనే జనవరి 1న జరిగే పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. రీజనల్‌ కో-ఆర్డినేటర్ల సమావేశం కంటే ముందుగా విజయసాయిరెడ్డి తన నివాసంలో ప్రకాశం జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

  • సిఎంఒ, పార్టీ కేంద్ర కార్యాలయాల ముందు నిరసన

వైసిపిలో అసంతృప్తులు తీవ్ర స్థాయికి చేరాయి. కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తే గెలుపు కోసం పనిచేసేది లేదంటూ తెగేసి చెబుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో చోటుచేసుకుంది. ఇందులో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టిక్కెట్టు ఇవ్వద్దొంటూ దాదాపు 20 వాహనాల్లో వైసిపి కార్యకర్తలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వంటి సీనియర్‌ నేతలు అందుబాటులో లేకపోవడంతో పార్టీ కేంద్ర కార్యాలయం ముందే బైఠాయించి నిరసన తెలిపారు. గోపిరెడ్డికి టిక్కెట్టు వద్దని, ఎమ్మెల్యే వద్దు-జగన్‌ ముద్దు అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనకు టిక్కెట్టు ఇవ్వొద్దని వైసిపి నాయకులు గజ్జెల మల్లారెడ్డి, రొంపిచర్ల జడ్‌పిటిసి పిల్లి ఓబుల్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ హనీఫ్‌ డిమాండ్‌ చేశారు. కొంత మంది కార్యకర్తలు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ నుండి వారు సిఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వారి వద్దకు వచ్చి, వారిని సముదాయించి వినతిపత్రం తీసుకున్నారు.

➡️