జనసేనలోకి వైసిపి ఎమ్మెల్సీ వంశీకృష్ణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణయాదవ్‌.. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సమక్షంలో బుధవారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తులో జనసేనదే కీలకభూమిక అని అన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రాభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉంటుందని భావించి నేతలు జనసేనలో చేరుతున్నారన్నారు. వంశీకృష్ణ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు తనతో కలిసి యువరాజ్యంలో పనిచేశారన్నారు. జనసేనలోకి ఆయన రావడం సొంతింటికి రావడమేనన్నారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం వంశీకృష్ణ మనస్ఫూర్తిగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. జనసేన పిఎసి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. వంశీకృష్ణ యాదవ్‌ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని అన్నారు. వైసిపిలోని అంతర్గత రాజకీయాల వల్ల ప్రజా సమస్యలను తీర్చలేకపోతున్నామని, కనీసం మాట్లాడలేక పోతున్నామనే ఆవేదనతో అనేక మంది జనసేనలోకి వస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ను సిఎంగా చూడటం కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానన్నారు.

➡️