తారువలో ఉద్రిక్తత

May 4,2024 21:26 #BJP, #BJP MP candidate, #CM RAMESH
  •  బిజెపి,వైసిపి కార్యకర్తల దాడులు
  •  పోలీస్‌ స్టేషన్‌ వద్ద సిఎం రమేష్‌ భైఠాయింపు

ప్రజాశక్తి – దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువ గ్రామంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బిజెపి, వైసిపి కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. డిప్యూటీ సిఎం, వైసిపి ఎంపి అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గ్రామంలో ఉన్న సమయంలోనే ఈ దాడులు చోటుచేసుకోవడం, కార్యకర్తల పరామర్శ పేరిట బిజెపి అభ్యర్థి సిఎం రమేష్‌ కూడా అక్కడకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. వైసిపి కార్యకర్తలే తమ వారిపై దాడికి దిగారని, వారికి బదులుగా తమ కార్యకర్తలనే పోలీసులు అదుపులో తీసుకున్నారని ఆరోపిస్తూ సిఎం రమేష్‌ దేవరాపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట భైఠాయించారు. అక్కడ నుండి ముత్యాలనాయుడికి సమీప బంధువైన ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు గంగాధర్‌ను పరామర్శించాలంటూ గ్రామంలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సిఎం రమేష్‌ చొక్కా చినిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు బూడి ముత్యాలనాయుడు బావమరిది, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన గంగాధర్‌ తారువలో రెండు, మూడు రోజులుగా డ్రోన్‌ ద్వారా బిజెపి జెండాను ఎగురవేస్తున్నారు. దీనిని ముత్యాలనాయుడుతో పాటు వైసిపి కార్యకర్తలు ప్రశ్నించారు. ఢ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. దీనిపై తమ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, అయితే పోలీసులు తమ వారిపైనే చర్యలు తీసుకున్నారని సిఎం రమేష్‌ ఆందోళనకు దిగడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. పోలీస్‌ స్టేషన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన సిఎం రమేష్‌ వైసిపి కార్యకర్తలు తనపైన కూడా దాడి చేశారని చెప్పారు. దాడికి ఉసిగొల్పిన ముత్యాలనాయుడిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ సంఘటనను తాము తేలికగా తీసుకోబోమని, కేంద్ర బలగాల సహాయంతో గ్రామంలో ప్రచారం చేస్తామని చెప్పారు.

➡️