cancer : పెరిగిపోతున్న క్యాన్సర్‌ రోగులు

May 14,2024 23:17 #Cancer, #corporate hospitals, #health
  •  ఏటా 20 శాతం పెరుగుదల
  •  సొమ్ము చేసుకునే పనిలో కార్పొరేట్‌ ఆసుపత్రులు

న్యూఢిల్లీ : రానున్నరోజుల్లో దేశవ్యాప్తంగా క్యాన్సర్‌ రోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేశారు. దీంతో ఆధునిక చికిత్స సదుపాయాల పేరుతో క్యాన్సర్‌ రోగుల నుంచి డబ్బులు గుంజే ప్రయత్నంలో కార్పొరేట్‌ ఆసుపత్రులు తలమునకలవుతున్నాయి. వైద్య రంగంలో వందల కోట్లలో పెట్టుబడులు పెట్టి.. వేల కోట్లలో లాభాలర్జించేందుకు తహతహలాడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్‌ ఆసుపత్రులు పడకల విస్తీర్ణాన్ని పెంచే యోచనలో ఉన్నాయి. క్యాన్సర్‌ చికిత్స కోసం హాస్పిటల్స్‌లో బెడ్స్‌ని పెంచే కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో ముందు వరసలో రాజీవ్‌ గాంధీ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఆర్‌సిఐఆర్‌సి), ఆస్టర్‌ డిఎం హెల్త్‌కేర్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, యధార్థ్‌ హాస్పిటల్స్‌ ఉన్నాయి. ఇవి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పెరుగుతున్న క్యాన్సర్‌ రోగుల సంఖ్యకు తగ్గట్టుగా పడకలను కూడా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
భారత్‌లో భవిష్యత్తులో క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతుందని ‘అపోలో హాస్పిటల్స్‌’ ‘హెల్త్‌ ఆఫ్‌ ది నేషన్‌ 2024’ గత నెల (ఏప్రిల్‌ 3)లో విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. 2020లో 1.39 మిలియన్‌ క్యాన్సర్‌ కేసులు ఉన్నాయి. అవి కాస్తా.. 2025 నాటికి 1.57 మిలియన్ల కేసులకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఐదేళ్ల కాలంలో క్యాన్సర్‌ కేసుల సంఖ్యలో సుమారు 13 శాతం పెరుగుదల కనిపిస్తోంది. లక్షల సంఖ్యలో క్యాన్సర్‌ రోగులు పెరగడంతో.. వారి జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. క్యాన్సర్‌ మహమ్మారి వల్ల జీవన ప్రమాణం తగ్గిపోయే వారి సంఖ్య 2021లో 27 మిలియన్ల నుండి 2025 నాటికి దాదాపు 30 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని అపోలో నివేదిక తెలిపింది. బహుశా వికసిత్‌ భారత్‌ భవిష్యత్తులో ‘క్యాన్సర్‌ కాపిటల్‌’ అన్న పేరు సంపాదించుకుంటుందని అపోలో నివేదిక స్పష్టం చేసింది.
ద నేషనల్‌ చెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో ఢిల్లీ ఆర్‌జిసిఐఆర్‌సి రాబోయే మూడు సంవత్సరాల్లో 155 పడకల్ని పెంచే యోచనలో ఉన్నట్లు ఆర్‌జిసిఐఆర్‌సి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డి.ఎస్‌ నేగి అన్నారు.

ఏటా 20 శాతం మేర క్యాన్సర్‌ రోగుల పెరుగుదల
ఇప్పటివరకు 1,30,000 మందికి క్యాన్సర్‌ ఉందని గుర్తించడం జరిగింది. ఇక వారిలో ఏడువేల మందిలో ప్రీ క్యాన్సర్‌ స్టేజ్‌లో ఉన్నారు. 690 మంది ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నారు. 2022లో క్యాన్సర్‌ రోగుల సంఖ్య 50 శాతం పెరిగింది. ప్రతి ఏడాదీ ఈ వ్యాధికి గురయ్యే వారి సంఖ్య 20 శాతం మేర పెరుగుతూనే ఉన్నారని బెంగళూరులోని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ నివేదిక వెల్లడించింది. క్యాన్సర్‌ రోగులకు ప్రత్యేక చికిత్స సదుపాయాల కోసం ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ రూ. 450 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులే పెట్టింది. ఇంకా మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనిల్‌ వినాయక్‌ అన్నారు. బ్లడ్‌ క్యాన్సర్‌లను గుర్తించడంలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. బోన్‌ క్యాన్సర్‌కి గురైన వారికి ఎముక మజ్జని మార్పిడి చేసే ప్రత్యేక సదుపాయాలు కలిగిన హెల్త్‌కేర్‌ ఫోర్టిస్‌దేనని ఆయన అన్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం చేసే వ్యాపారంలో 2024-2025 సంవత్సరంలో 20 నుంచి 25 శాతం మేర పెరిగి సుమారు రూ.1,400 కోట్ల రాబడి వస్తుందని అనీల్‌ వినాయక్‌ తెలిపారు.
శస్త్రచికిత్స, రేడియేషన్‌తో సహా అంకాలజీ, రోబోటిక్‌ సర్జరీ వంటి అధునాతన పద్ధతుల కోసం ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు ఆస్టర్‌ డిఎం హెల్త్‌కేర్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 2026-27 నాటికి 1,700 పడకల్ని పెంచేదిశగా ఈ కార్పొరేట్‌ ఆసుపత్రి ప్రయత్నిస్తోంది. వీటి కోసం వెయ్యి కోట్ల రూపాయల్ని ఖర్చు చేయనుంది. 2027 నాటికి తిరువనంతపురంలో 454 పడకలు గల ఆసుపత్రి నిర్మించనుంది. కాసరగోడ్‌లో 264 పడకలు, దేశవ్యాప్తంగా 6,600 పడకలు గల ఆసుపత్రుల్ని నిర్మించబోతున్నట్లు ఆస్టర్‌ డిఎం హెల్త్‌కేర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నితీష్‌ శెట్టి అన్నారు. ఇలా చికిత్స కోసం ఆసుపత్రిల్ని రీ మోడల్‌ చేయించడం కోసం పెట్టిన పెట్టుబడుల్లో కనీసం 15 శాతం వృద్ధి ఉంటుందని శెట్టి అన్నారు.
ఇక యథార్థ్‌ హెల్త్‌కేర్‌ కూడా పడకల విస్తరణకు ప్రయత్నిస్తోంది. ఈ హెల్త్‌కేర్‌ ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లోని పడకల విస్తరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు డైరెక్టర్‌ యధార్త్‌ త్యాగి తెలిపారు.

➡️