Rain Tax – వానొచ్చెనంటే.. ట్యాక్స్‌ వస్తదీ..!

Mar 30,2024 13:50 #Canada, #Rain Tax

కెనడా : ‘ వాన కురిసిందా.. ట్యాక్స్‌ కట్టండి ‘ అదేంటి ? ఆదాయపు పన్ను, ఇంటి పన్ను, టోల్‌ పన్ను ఇలాంటివి విన్నాం కానీ వాన కురిస్తే పన్ను కట్టడమేంటీ ? అనుకుంటున్నారా ? అవునండీ..! ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కెనడా ప్రభుత్వం అక్కడి ప్రజలపై రెయిన్‌ ట్యాక్స్‌ అమలు చేయనుంది.. వచ్చే నెల నుండి ఈ పన్ను వసూలు చేస్తారట..! ‘స్ట్రోమ్‌ వాటర్‌ ఛార్జ్‌’ పేరిట టరంటో సిటీలో దీన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలను కూడా ప్రచురించాయి.

కెనడాలో అధికభాగం రాతినేలలే ఉండటంతో … వర్షపునీరు నేలలో ఇంకేందుకు చాలా సమయం పడుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా డ్రెయిన్‌ వాటర్‌తో నాలాలు పొంగిపొర్లుతుంటాయి. ఈ సమస్యను ‘రన్‌ఆఫ్‌’ అంటారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్‌ వాటర్‌ ఛార్జ్‌ను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా సేకరించిన అదనపు నీటిని బయటకు తీస్తారు. దానికి అయ్యే ఖర్చులను రెయిన్‌ట్యాక్స్‌ ద్వారా భర్తీ చేస్తారు. వర్షపు పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్కువ భవనాలు ఉన్న చోట ఎక్కువ రన్‌ఆఫ్‌ ఉంటుంది. అందువల్ల అక్కడ వర్షం పన్ను కూడా ఎక్కువ విధిస్తారు.

అత్యధిక పన్ను విధించే దేశం కెనడా..!
ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను విధించే దేశాల విభాగంలో కెనడా ఉంటుంది. తాజాగా వర్షపు పన్ను ప్రజలపై మరింత భారం మోపేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే అద్దె ఇళ్లలో నివసించే వారిపై ఈ పన్ను విధిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

నిరసనలు…

కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, అనేక ఇతర ప్రదేశాలున్నాయి. టరంటో ప్రజలు ఇప్పటికే నీటిపై పన్ను చెల్లిస్తున్నారు. ఇందులో తుపాను నీటి నిర్వహణ ఖర్చు కూడా ఉందని కొందరు చెబుతున్నారు. నీటి పన్నుతోపాటు ప్రత్యేకంగా రెయిన్‌ట్యాక్స్‌ విధించడంపట్ల ప్రజల నుంచి విమర్శలు వస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. వానొస్తే హమ్మయ్యా అనుకునే రోజులుపోయి.. వామ్మో వానొచ్చిందా ట్యాక్స్‌ కట్టాలా ..! అంటూ కెనడా ప్రజలు బెంబేలెత్తిపోయేలా ఉంది ఈ రెయిన్‌ ట్యాక్స్‌..!

➡️