గర్భాశయ క్యాన్సర్‌ ఎందుకొస్తుంది? లక్షణాలేంటి?

Feb 6,2024 13:26 #cervical cancer, #health

ప్రముఖ బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందిందనే వార్త ఇటీవల హల్‌చల్‌ అయ్యింది. ఆ తర్వాత తాను బతికే ఉన్నానని.. కేవలం సర్వైకల్‌ క్యాన్సర్‌ గురించి అవగాహన కల్పించేందుకే అలా వైరల్‌ చేసినట్టు పూనమ్‌ పాండే సోషల్‌మీడియా పోస్టు ద్వారా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటిలే కాకుండా.. ఇటీవలి కాలంలో ఎక్కువమంది మహిళలు సర్వైకల్‌ క్యాన్సర్‌కి గురవుతున్నారు. ఈ క్యాన్సర్‌ని గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణహాని తప్పుతుంది. లేకపోతే చాలా చిన్న వయసులోనే ఈ క్యాన్సర్‌ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి అసలు సర్వైకల్‌ క్యాన్సర్‌ ఎందుకొస్తుంది? దాని లక్షణాలేంటో తెలుసుకుందామా..!

గర్భాశయానికి కింది భాగంగా ఉండే సన్నటి ప్రదేశాన్ని సర్విక్స్‌ అంటారు. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. ఆ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్‌ని సర్వైకల్‌ క్యాన్సర్‌ అంటారు. ఈ క్యాన్సర్‌ ఎక్కువగా హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పివి) వల్ల వస్తుంది. హెచ్‌పివి అనేది చాలా సాధారణ వైరస్‌. ఇది దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో సోకుతుంది. అయితే ఈ హెచ్‌పివి వైరస్‌లోనే విభిన్న జాతులు ఉన్నాయి. వీటిల్లో హెచ్‌పివి 16, హెచ్‌పివి 18 రకాలు అత్యధిక ప్రమాదకరమైనవి. ఈ హెచ్‌పివి 16, హెచ్‌పివి 18ల వల్లే సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలెక్కువ. ఇప్పటివరకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా హెచ్‌పివి 16, హెచ్‌పివి 18 కారణంగానే 70 శాతం గర్భాశయ క్యాన్సర్‌లు వచ్చినట్టు తెలుస్తోంది. లైంగికంగా సంక్రమించే వ్యాధి వల్ల కానీ, గర్భాశయ కణాలలో వచ్చే మార్పుల వల్ల కానీ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. హెచ్‌పివి పరీక్షల ద్వారా ఈ సర్వైకల్‌ క్యాన్సర్‌ని గుర్తించవచ్చు. అయితే గర్భాశయ క్యాన్సర్‌ని మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదమేమీ ఉండదని వైద్యులు చెబుతున్నారు.

లక్షణాలు

– పీరియడ్స్‌ సమయంలో విపరీతంగా రక్తస్రావం అవుతుంది.

– నిరంతరం పొత్తి కడుపులో నొప్పి రావడం, పీరియడ్స్‌ మధ్యలో తేలికపాటి రక్తస్రావం కావడం, లేదా బ్లడ్‌ డ్రాప్స్‌ కనిపించడం కూడా గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.

– శృంగారంలో పాల్గొన్న తర్వాత బ్లీడింగ్‌ కావడం, సాధారణం కంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్‌ కావడం, నీళ్లలాగా యోని నుండి స్రావాలు రావడం, ఆ స్రావాలు కూడా దుర్వాసన వస్తే అవి కచ్చితంగా గర్భాశయ లక్షణాలేనని వైద్యులు అంటున్నారు.

– మెనోపాజ్‌ తర్వాత కూడా ఓవర్‌ బ్లీడింగ్‌ అవుతుంటే నిర్లక్ష్యం చేయకుండా.. వైద్యులను సంప్రదించాలి.

 

➡️