పిల్లల కోసం ఎల్‌ఐసి కొత్త ప్లాన్‌ అమృత్‌బాల్‌ ఆవిష్కరణ

Feb 17,2024 21:05 #Business

ఐదేళ్లు కడితే చాలు

సింగిల్‌ ప్రీమియంతోనూ అవకాశం

న్యూఢిల్లీ : దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) పిల్లల కోసం కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. అమృత్‌బాల్‌ పేరిట ఆవిష్కరించిన ఈ ప్లాన్‌లో ఐదేళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. లేదా సింగిల్‌ ప్రీమియంతోనూ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. పిల్లల చదువుల కోసం దీర్ఘ కాలంలో మదుపు చేయాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఎల్‌ఐసి తెలిపింది. ఇదో నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ అని పేర్కొంది. ఫిబ్రవరి 17 నుంచి దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. అమృత్‌బాల్‌ పథకాన్ని ఎల్‌ఐసి ఛైర్‌పర్సన్‌ సిద్దార్థ మొహంతి, ఆర్థిక సేవల మంత్రిత్వ శాఖ సెక్రటరీ వివేక్‌ జోషి ఆవిష్కరించారు.పిల్లల ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకునే తల్లిదండ్రుల కోసం ఈ ప్లాన్‌ను ఆవిష్కరించినట్లు ఎల్‌ఐసి పేర్కొంది. ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే చాలని, లేదా ఒకేసారి చెల్లించే ఆప్షన్‌ కూడా ఉందని వెల్లడించింది. ఏడాదికి వెయ్యికి రూ.80 ఆకర్షణీయమైన గ్యారెంటీడ్‌ అడిషన్‌ అందించనుంది. ప్రీమియం కాల వ్యవధిలో బీమా హామీ ఇచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం ఎక్కువ మొత్తం అవసరమయ్యే 18-25 ఏళ్ల వయసు మధ్య పాలసీ మెచ్యూర్‌ అవుతుంది. దీంతో చిన్నారుల ఉన్నత చదువులకు అవసరమయ్యే నిధిని సమకూర్చుకోవడానికి వీలు పడుతుంది. ఈ పాలసీని 30 రోజుల నుంచి గరిష్ఠ వయో పరిమితి 13 ఏళ్లు కలిగిన పిల్లల పేరుతో తీసుకోవడానికి వీలుంది. మెచ్యూరిటీ కనిష్ఠ వయసు 18 ఏళ్లుగా నిర్ణయించగా.. గరిష్ఠ వయస్సు 25 ఏళ్లుగా ప్రకటించింది. పాలసీ టర్మ్‌ కనీసం 10 ఏళ్లు ఉండగా.. గరిష్ఠంగా 25 ఏళ్లు ఎంచుకోవడానికి వీలుంది. ఈ పాలసీ కింద రుణ సదుపాయం కూడా కల్పిస్తుంది. నెలవారీ, మూడు నెలలకోసారి, ఆరు మాసాలు, ఏడాదికోసారి చొప్పున ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

➡️