పేటీఎంకు స్టార్టప్‌’ల దన్ను.. పున: పరిశీలించాలని కేంద్రానికి అప్పీల్‌..!

Feb 6,2024 21:20 #Business

ముంబయి: ప్రముఖ ఫిన్‌ టెక్‌ స్టార్టప్‌ ‘పేటీఎం సంక్షోభంపై పలు స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులు స్పందించారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై ఆర్బీఐ విధించిన నిషేధాన్ని పున: పరిశీలించాలని, సమీక్షించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌లకు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఈ నెల 29 తర్వాత కీలక బ్యాంకింగ్‌ సేవలను నిలిపివేయాలని జనవరి 31న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌, కేంద్ర ఆర్థిక మంత్రిలకు రాసిన లేఖపై పాలసీ బజార్‌ ఫౌండర్‌ యాశిష్‌ దాహియా, భారత్‌ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగావెల్‌ జానకీరామ్‌, మైక్‌ మై ట్రిప్‌ ఫౌండర్‌ రాజేశ్‌ మాగోవ్‌, ఇన్నోవ్‌ 8 వ్యవస్థాపకుడు రితేశ్‌ మాలిక్‌ సంతకాలు చేశారు. పేటీఎంపై విధించిన నిషేధాజ్ఞలు.. కేవలం ఆ సంస్థపైనే కాక ఫిన్‌ టెక్‌ సంస్థల లావాదేవీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. పేటీఎంపై విధించిన ఆంక్షలను పున: పరిశీలించాలని, ఆర్థిక వ్యవస్థ విశాల ప్రయోజనాలను, ఫిన్‌ టెక్‌ కంపెనీల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులు కోరారని తెలుస్తున్నది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌) యూజర్ల ఖాతాలను క్రియేట్‌ చేయడంలో కేవైసీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది. దీని పరిష్కారానికి విండో కల్పించాలని ఇందుకోసం బహిరంగ చర్చ, సహకారంతో ముందుకు సాగాలని స్టార్టప్‌ల వ్యవస్థాపకులు కోరారు.

➡️