రూ.15 లక్షల కోట్ల ‘క్లబ్‌’లో టీసీఎస్‌.. చరిత్రలో ఫస్ట్‌ టైం..!

Feb 6,2024 21:33 #Business

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మరో మైలురాయిని దాటింది. ‘యూరోప్‌ అసిస్టెన్స్‌’ సంస్థతో డీల్‌ కుదిరినట్లు సోమవారం ఎక్స్చేంజ్‌లకు టీసీఎస్‌ సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఆ సంస్థ స్టాక్‌ నాలుగు శాతానికి పైగా పుంజుకున్నది. బీఎస్‌ఈలో టీసీఎస్‌ స్టాక్‌ రూ.4,135.9 (2024 ఫిబ్రవరి 6) వద్ద ఆల్‌ టైం గరిష్ట స్థాయిని తాకింది. దీంతో టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.15 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ మార్క్‌ ను టీసీఎస్‌ దాటడం ఇదే తొలిసారి. గ్లోబల్‌ అసిస్టెన్స్‌ అండ్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ‘యూరోప్‌ అసిస్టెన్స్‌’తో డీల్‌ గెలుచుకున్నట్లు స్టాక్‌ మార్కెట్లలో టీసీఎస్‌ ప్రకటించింది. ఈ డీల్‌ గ్లోబల్‌ ఐటీ ఆపరేటింగ్‌ మోడల్‌గా నిలుస్తుంది. ఈ డీల్‌లో భాగంగా యూరోప్‌ అసిస్టెన్స్‌ సంస్థకు ‘ఎండ్‌ టు ఎండ్‌ ఐటీ అప్లికేషన్‌ సర్వీసెస్‌’ అందించేందుకు యూరప్‌ అంతటా టీసీఎస్‌ డెలివరీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. యూరోప్‌ అసిస్టెన్స్‌ సంస్థతో డీల్‌ ప్రకారం ఆ సంస్థకు టీసీఎస్‌ తన ఇగ్నియో ఏఐ ఆప్స్‌ సేవలు అందించనున్నది. కో-ఇన్నోవేషన్‌ మీద రెండు సంస్థలు కలిసి పని చేస్తాయి. జెనరేటివ్‌ ఏఐ, ఇతర అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీల వినియోగంలో కలిసి పని చేస్తాయి. యూరోప్‌ అసిస్టెన్స్‌తో భాగస్వామ్యం ప్రకటించిన నేపథ్యంలో బీఎస్‌ఈలో మంగళవారం ఉదయం 10.02 గంటలకు 3.6 శాతం పెరిగి రూ.4,114.6 వద్ద ట్రేడయింది. అప్పుడు సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.15,06,376 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికంలో టీసీఎస్‌ అంచనాలకు మించి రెవెన్యూ సాధించినట్లు నివేదించింది. 2022-23 మూడో త్రైమాసికంతో పోలిస్తే సంస్థ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రెండు శాతం పెరిగి రూ.11,058 కోట్లకు, ఆదాయం నాలుగు శాతం పెరుగుదలతో రూ.60,583 కోట్లకు చేరుకున్నది.

➡️