అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభాల్లో 37% పతనం

May 3,2024 08:20 #Adani, #Business

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నికర లాభాలు 37.63 శాతం పతనమై రూ.450.58 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.722.48 కోట్ల లాభాలు సాధించింది. కాగా డిసెంబర్‌ త్రైమాసికంలోని రూ.1,888.45 కోట్ల లాభాలతో పోల్చితే గడిచిన క్యూ4లో ఏకంగా 78.14 శాతం క్షీణత చోటు చేసుకుంది. కాగా.. కంపెనీ మొత్తం ఆదాయం 1.08 శాతం పెరిగి రూ.29,630 కోట్లకు చేరింది. 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.29,311 కోట్ల ఆదాయం నమోదు చేసింది.
”అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ భారత్‌లో ప్రధాన వ్యాపార సంస్థగానే కాకుండా, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రపంచ అగ్రగామిగా కూడా తన స్థానాన్ని మరోసారి ధవీకరించింది. పనితీరు, సమర్థవంతమైన మూలధన ప్రవాహ నిర్వహణ కలిగి ఉంది.” అని అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. 2023-24లో మొత్తంగా 31.04 శాతం పెరుగుదలతో రూ.3,240.78 కోట్ల నికర లాభాలు సాధించింది. 2022-23లో రూ.2,472.94 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.1,28,734 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన 2023-24లో 23.65 శాతం క్షీణించి రూ.98,281.51 కోట్లకు పరిమితమయ్యింది. ప్రతీ రూ.1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.1.3 మధ్యంతర డివిడెండ్‌ను ఆ కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. 2024 జూన్‌ 30న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎం) నిర్వహించనున్నట్లు తెలిపింది. గురువారం బిఎస్‌ఇలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 0.56 శాతం తగ్గి రూ.3,037.15 వద్ద ముగిసింది.

➡️