త్వరలో యుపిఐతో నగదు డిపాజిట్‌

Apr 5,2024 21:32 #Business, #RBI, #upi

యుపిఐ సాంకేతికతను మరింత విస్తరించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. తాజాగా నగదు డిపాజిట్లను సైతం యుపిఐ ద్వారా చేసే సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశాల అనంతరం శుక్రవారం దాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు క్యాష్‌ డిపాజిట్‌ మిషన్‌ (సిడిఎం) లో డెబిట్‌ కార్డు ద్వారా మాత్రమే నగదు డిపాజిట్‌ చేసే వెసులుబాటు ఉంది. త్వరలో యుపిఐని ఉపయోగించి కూడా సిడిఎంలో డబ్బును జమ చేసే వెసులుబాటును తీసుకొస్తున్నట్లు దాస్‌ తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. గతంలో డెబిట్‌ కార్డ్‌ సాయంతో ఎటిఎంల్లో నగదు ఉపసంహరించుకునే వీలుండేదని.. యుపిఐ రాకతో కార్డ్‌ లేకుండా నగదు పొందే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే యుపిఐతోనూ త్వరలో నగదు డిపాజిట్లు చేసుకోవచ్చన్నారు. వరుసగా ఏడో సారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించామన్నారు. రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగించాలని ఆర్‌బిఐ భావించిందన్నారు.

➡️