అదరగొట్టిన కోల్‌ ఇండియా

May 2,2024 20:56 #Business, #coal india
  • క్యూ4 లాభాల్లో 26% వృద్థి

కోల్‌కత్తా : ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. వివిధ ఎజెన్సీల అంచనాలకు మించి నికర లాభాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 26 శాతం వృద్థితో రూ.8,682 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. 2022-23 ఇదే క్యూ4లో రూ.6,869.5 కోట్ల లాభాలు ప్రకటించింది. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ పెంచుకోవడంతో పాటు వ్యయాలను తగ్గించడంతో గడిచిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించింది.
దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఈ పిఎస్‌యు 80 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. గడిచిన క్యూ4 కంపెనీ రెవెన్యూ 2 శాతం పెరిగి రూ.37,410 కోట్లకు చేరింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో రూ.38.152 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. 2023-24కు గాను తుది డివిడెండ్‌ కింద ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.5 డివిడెండ్‌ను అందించడానికి ఆ కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో కోల్‌ ఇండియా మొత్తం లాభాలు 18 శాతం పెరిగి రూ.37,402 కోట్లకు చేరాయి. 2022-23లో రూ.31,763 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.1.38 లక్షల కోట్లుగా ఉండగా.. గడిచిన 2023-24లో 3 శాతం పెరిగి రూ.1.42 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది.

➡️