దేశంలోకి విదేశీ సరుకుల వరద

May 14,2024 08:14 #Business
  • భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దెబ్బ
  • ఎగుమతుల కంటే దిగుమతుల వృద్థి ఎక్కువ
  • విదేశీ సరకుల రాకలో 38% పెరుగుదల
  • ఎగుమతుల్లో మాత్రం 14 శాతం వృద్థి

న్యూఢిల్లీ : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎగుమతుల్లో వృద్థి తక్కువగా ఉండగా.. మరోవైపు ఇబ్బడిమబ్బడిగా దిగుమతులు పెరిగాయి. గడిచిన ఐదేళ్లలో ఎగుమతుల వృద్థి కంటే దిగుమతులు రెట్టింపు అయ్యాయి. గడిచిన 2019-24 ఆర్థిక సంవత్సరాల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) భాగస్వామ్య దేశాల నుండి భారత్‌కు వస్తు దిగుమతులు 38 శాతం పెరిగాయి. భారత్‌తో ఎఫ్‌టిఎ కలిగిన యుఎఇ, సౌత్‌ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర దేశాల నుంచి 2023-24లో 187.92 బిలియన్‌ డాలర్ల దిగుమతులు జరిగాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జిటిఆర్‌ఐ) సంస్థ వెల్లడించింది. 2018-19 నాటికి ఈ దిగుమతులు 136.20 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు ఎఫ్‌టిఎ భాగస్వామ్య దేశాలకు భారత ఎగుమతులు 2023-24లో 14.48 శాతం మాత్రమే పెరిగి 122.72 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2018-19లో 107.20 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఈ పరిణామాలతో మోడీ హయంలోని బిజెపి సర్కార్‌ పలు దేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎ) ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నాయని స్పష్టమవుతోంది.

జిటిఆర్‌ఐ రిపోర్ట్‌ ప్రకారం.. 2023ా24లో యుఎఇకి ఎగుమతులు 18.25 శాతం పెరిగి 35.63 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇవి 2018ా19లో 30.13 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 2018ా19లో 29.79 బిలియన్లుగా ఉండగా.. 2023ా24లో 61.21 శాతం ఎగిసి 48.02 బిలియన్లకు చేరాయి. యుఎఇతో 2022లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది.

ఆస్ట్రేలియాతో 2022 డిసెంబర్‌లో ఒప్పందం కుదిరింది. ఆ దేశానికి 2018ా19లో 3.52 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు ఉండగా.. 2023ా24లో 7.94 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. అదే సమయంలో దిగుమతులు 13.13 బిలియన్లుగా ఉండగా.. 23.06 శాతం పెరిగి 16.16 బిలియన్లగా నమోదయ్యాయి. ఆగేయాసియా 10 దేశాల కూటమి ఆసియన్‌ బ్లాక్‌కు 2018ా19లో 37.47 బిలియన్ల ఎగుమతులు జరగ్గా.. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 శాతం పెరిగి 41.21 బిలియన్లకు చేరుకున్నాయి. దిగుమతులు 34.3 శాతం పెరిగి 59.32 బిలియన్‌ డాలర్ల నుంచి 79.67 బిలియన్‌ డాలర్లకు చేరాయి.
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దక్షిణ కొరియాకు భారత ఎగుమతులు 36.38 శాతం పెరిగి 4.71 బిలియన్ల నుండి 6.42 బిలియన్లకు చేరాయి. దిగుమతులు 26.12 శాతం పెరిగి 16.76 బిలియన్ల నుండి 21.14 బిలియన్లకు చేరుకున్నాయి. భారత్‌ా దక్షిణ కొరియా మధ్య 2011లో ఎఫ్‌టిఎ అమల్లోకి వచ్చింది. జపాన్‌కు ఎగుమతులు 6.06 శాతం స్వల్పంగా పెరిగాయి. 2018-19లో 4.86 బిలియన్లుగా ఉండగా.. 2023-24లో 5.16 బిలియన్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 38.56 శాతం పెరిగి 12.77 బిలియన్ల నుండి 17.70 బిలియన్లకు చేరుకున్నాయి. భారతదేశం-జపాన్‌ ఎఫ్‌టిఎ 2011లో అమలు చేయబడింది. ”ఈ గణంకాలు భారతదేశ ఎఫ్‌టిఎ గ్లోబల్‌ వాణిజ్య తీరుతెన్నులను ప్రదర్శిస్తుంది.” అని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ డేటా పేర్కొంది.

ఎగుమతుల్లో 17వ స్థానం..
ప్రపంచ వాణిజ్యంలో స్థూల ఎగుమతుల్లో 1.8 శాతం వాటాతో భారత్‌ 17వ స్థానంలో ఉంది. అత్యధిక దిగుమతుల విషయంలో ప్రపంచ వాణిజ్యంలో 2.8 శాతం వాటాతో 8వ స్థానంలో ఉంది. 2023-24లో భారతదేశ స్థూల సరుకుల ఎగుమతులు 3.11 శాతం తగ్గి 437.1 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. దిగుమతులు 5.4 శాతం తగ్గి 677.2 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి.

➡️