బంగారం కొనడం కష్టమే.. రూ.70వేలు దాటిన పసిడి

Apr 2,2024 06:47 #Business, #Gold

న్యూఢిల్లీ : పేద, సాధారణ ప్రజలు కొనలేని స్థాయికి బంగారం ధరలు ఎగిశాయి. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.70,000 దాటింది. సోమవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1,070 పెరిగి రూ.68,420కి చేరిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ తెలిపింది. కిలో వెండిపై రూ.1,120 ఎగిసి రూ.78,570గా పలికింది. బంగారం ధరకు మూడు శాతం జిఎస్‌టి కలిపితే రూ.70వేల పైనే చెల్లించాల్సి ఉంటుంది. బంగారం ఇంత గరిష్ట ధర పలకడం ఇదే తొలిసారి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించనుందన్న అంచనాలు బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణమని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మర్‌ పేర్కొన్నారు. మరోవైపు చైనాలో బంగారానికి డిమాండ్‌ పెరగడం కూడా ఓ కారణమన్నారు. గుడ్‌ రిటర్న్స్‌ ప్రకారం.. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.69,380గా, 22 క్యారెట్ల ధర రూ.63,600గా పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ (31.10 గ్రాములు) 2,265.73 డాలర్ల వద్ద నమోదవుతోంది. అమాంతం పెరుగుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు తీవ్ర గురి చేస్తున్నాయి.

➡️