నివాసాల కొనుగోలుకు మంచి సమయం

Nov 23,2023 21:10 #Business

డిసెంబర్‌లో ఎస్‌బిఐ మెగా ప్రాపర్టీ షోసిజిఎం వెల్లడి

హైదరాబాద్‌ : నివాసాల కొనుగోళ్లకు ఇది సరైన సమయమని ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజేష్‌ కుమార్‌ అన్నారు. ఇందుకోసం వచ్చే డిసెంబర్‌ 1ా3 తేదిల్లో నగరంలోని హైటెక్స్‌లో ఎస్‌బిఐ మెగా ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నామన్నారు. గురువారం ఎస్‌బిఐ స్థానిక ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రాపర్టీ షోకు సంబంధించిన ప్రచార రథాన్ని ఆయన, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాపర్టీ షోలో 70 మంది పెద్ద బిల్డర్లు తమ 600 మేర ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారన్నారు. ఒకే వేదిక వద్ద అన్ని పరిష్కారాలు అందించే యోచనతో దీన్ని ఏర్పాటు చేశామన్నారు. సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా కనీసం 8.25 శాతం వడ్డీ రేటుతో రుణాలను జారీ చేయనున్నామన్నారు. గృహ రుణాల జారీలో తమ బ్యాంక్‌ మార్కెట్‌ లీడర్‌గా ఉందన్నారు. దేశంలోని 23వేల శాఖలు దాదాపు రూ.6.80 లక్షల కోట్ల గృహ రుణాలను జారీ చేశాయన్నారు. ప్రస్తుత ఏడాదిలో రూ.1 లక్ష కోట్ల రుణాల జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌ రూ.57వేల కోట్ల గృహ రుణాల పోర్టు పోలియోను కలిగి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా గృహ రుణాల మార్కెట్‌లో తమకు 25 శాతం మార్కెట్‌ వాటా ఉందన్నారు.

➡️