ఇండియన్‌ బ్యాంక్‌ ఫలితాలు ఆకర్షణీయం

May 6,2024 21:24 #Business, #indian bank
  • తగ్గిన స్థూల ఎన్‌పిఎలు
  • నికర లాభాల్లో 55% వృద్థి

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 55 శాతం వృద్థితో రూ.2,247 కోట్ల నికర లాభాలు సాధించింది. బ్యాంక్‌ ఆదాయం పెరగడంతో పాటుగా మొండి బాకీలు తగ్గడం మెరుగైన ఫలితాలకు దోహదం చేసింది. 2022-23 ఇదే క్యూ4లో రూ.1,447 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇదే సమయంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.14,238 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ4లో 19 శాతం ఎగిసి రూ.16,887 కోట్లకు చేరింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆసుతలు 3.93 శాతానికి దిగివచ్చాయి. 2023 మార్చి ముగింపు నాటికి స్థూల ఎన్‌పిఎలు 5.95 శాతంగా ఉన్నాయి. కాగా.. 0.90 శాతంగా ఉన్న నికర నిరర్థక ఆస్తులు.. 2024 మార్చి ముగింపు నాటికి 0.43 శాతానికి పరిమితమయ్యాయి. గడిచిన క్యూ4లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 9 శాతం పెరిగి రూ.6,015 కోట్లుగా చోటు చేసుకుంది. 2022-23 ఇదే క్యూ4లో ఎన్‌ఐఐ రూ.5,508 కోట్లుగా నమోదయ్యింది.
2023-24 మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభాలు 53 శాతం వృద్థితో రూ.8,063 కోట్లకు పెరిగాయి. 2022-23లో రూ.5,282 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.52,085 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెరిగి రూ.63,482 కోట్లకు చేరింది. ఏడాదికేడాదితో పోల్చితే 2024 మార్చి ముగింపు నాటికి బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు 11 శాతం పెరిగి రూ.6,88,000 కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్‌ ఎకౌంట్‌ సేవింగ్‌ ఎకౌంట్‌ (కాసా) డిపాజిట్లు 8 శాతం వృద్థి చోటు చేసుకుంది. స్థూల రుణాలు 13 శాతం పెరిగి రూ.5,33,773 కోట్లకు చేరాయి. 2023 మార్చి ముగింపు నాటికి స్థూల రుణాలు రూ.4,73,586 కోట్లుగా నమోదయ్యాయి. సోమవారం బిఎస్‌ఇలో ఇండియన్‌ బ్యాంక్‌ షేర్‌ 1.93 శాతం తగ్గి రూ.533.05 వద్ద ముగిసింది.

➡️