ఎఐలో లక్ష మందికి ఇంటర్న్‌షిప్‌

May 18,2024 21:08 #ai, #Business, #Internship, #one lakh people
  •  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మద్దతు
  •  ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యం
  •  స్వేచ్ఛ వ్యవస్థాపకులు వై కిరణ్‌ చంద్ర వెల్లడి

ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో : ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా లక్ష మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ)పై ఇంటర్న్‌షిప్‌ కల్పిస్తున్నట్లు స్వేచ్ఛ వ్యవస్థాపకుడు వై కిరణ్‌ చంద్ర తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని స్వేచ్ఛ కార్యాలయంలో సెక్రటరీ ప్రవీణ్‌ చంద్ర, ఒజోనెటెల్‌ కమ్యూనికేషన్‌ సిటిఒ చైతన్య చొక్కారెడ్డితో కలిసి కిరణ్‌ చంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాన్ని ఐఐఐటి హైదరాబాద్‌, ఓజోనెటెల్‌ కమ్యూనికేషన్స్‌, మెటా సహకారంతో చేపడుతున్నామన్నారు. స్వేచ్చ అనేది ఉచిత సాఫ్ట్‌వేర్‌, ఉచిత నాలెడ్జ్‌ను అందించే లాభాపేక్ష లేని సంస్థ అన్నారు. ఈ వేసవిలో విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ‘సమ్మర్‌ ఆఫ్‌ ఎఐ’పై ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగు భాషా కేంద్రీకృత లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం) అభివృద్థికి స్వేచ్ఛకు సహాయం చేస్తూనే.. ఎఐ నైపుణ్యాలతో సన్నద్ధం చేయనున్నామని తెలిపారు.
ఈ ఇంటర్న్‌షిప్‌ తొలి బ్యాచ్‌ 10,000 మందితో ప్రారంభమయ్యిందన్నారు. భాషా సుసంపన్నమైన తెలుగు సంపదను ఈ ఇంటర్న్‌షిప్‌లో ఒక్కో విద్యార్థి కనీసం 50 మందిని కలిసి తమ ప్రాంతాలలో, వివిధ మాండలీకాలలో ఉన్న ఈ సంపదను డాక్యుమెంట్‌ చేసి, అలా రూపొందించన డేటా సెట్ల మీద ఎఐ ట్రైనింగ్‌ పొందనున్నారన్నారు. ఇది ప్రపంచంలోనే వినూత్నమైన ఒక విశిష్ట ప్రయోగమన్నారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనే విద్యార్థులకు ఎఐ నిపుణులు తర్ఫీదునిస్తారన్నారు. నెలరోజుల పాటు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌లను ఇవ్వనున్నామన్నారు.
”ఎఐ అంటే అందరికీ చాట్‌ జిపిటి గుర్తుకు వస్తుంది. ఇంగ్లీషు భాష మినహాయించి ఇతర భాషలలో ఈ టెక్నాలజీ అందుబాటుకి సంబందించి పరిమితులున్నాయి. భారతీయ భాషల విషయానికి వస్తే మరీ అంతంత మాత్రమే. భారతీయ భాషలలో ఎఐ సొల్యూషన్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఆకాంక్షతో స్వేచ్ఛ సంస్థ ఒక పరిపూర్ణమైన తెలుగు భాషలో ఒక లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ అంటే చాట్‌ జిపిటి వంటి పరిష్కారాన్ని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించింది. దీని సాధనకై ఒక లక్ష మంది ఇంజనీరింగ్‌, సాంకేతిక,ఇతర విద్యార్థులను భాగస్వాములను చేస్తుంది.” అని స్వేచ్ఛ సంస్థ పేర్కొంది.

➡️