ఎల్‌ఐసి ఫలితాలు అదుర్స్‌- క్యూ3 లాభాల్లో 49 శాతం వృద్థి

Feb 9,2024 11:44 #Business

మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన సంస్థ

దుమ్మురేపిన షేర్‌ విలువ

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 49 శాతం వృద్థితో రూ.9,444 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.6,334 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్న నికర ప్రీమియం ఆదాయం.. గడిచిన క్యూ3లో 5 శాతం పెరిగి రూ.1.17 లక్షల కోట్లకు చేరింది. 2023-24కు గాను ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.4 మధ్యంతర డివిడెండ్‌ను అందించడానికి సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 21వ తేదిని రికార్డ్‌ తేదిగా పేర్కొంది. ఆ తర్వాత 30 రోజుల్లోగా డివిడెండ్‌ను చెల్లించనుంది. దేశంలో రెండు డజన్ల పైగా బీమా కంపెనీలు ఉన్నప్పటికీ.. ఇప్పటికీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో ఎల్‌ఐసి 58.90 శాతం మార్కెట్‌ వాటాతో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లో ఎల్‌ఐసి నికర లాభాలు రూ.26,913 కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 అదే తొలి తొమ్మిది మాసాల్లోరూ.22,969 కోట్ల లాభాలు ప్రకటించింది. 2023 డిసెంబర్‌ నాటికి గడిచిన తొమ్మిది మాసాల్లో సంస్థ మొత్తం వ్యక్తిగత వ్యాపార ప్రీమియం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.09 లక్షల కోట్లకు పెరిగింది.

ఐసిఐసిఐ బ్యాంక్‌ను దాటేసిన ఎల్‌ఐసి

స్టాక్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసి షేర్‌ దూసుకుపోతుంది. గురువారం బిఎస్‌ఇలో 5.86 శాతం పెరిగి రూ.1,106.25 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 9.51 శాతం ఎగిసి రూ.1,144 గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ.6.99 లక్షల కోట్లకు ఎగిసింది. దీంతో దేశంలోనే అగ్రశ్రేణీ 5 స్టాక్స్‌ సరసన చేరింది. ఇంతక్రితం ఈ స్థానంలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్‌ను దాటేసింది. ఎల్‌ఐసి షేర్‌ రూ.1,144కు చేరిన సమయంలో మార్కెట్‌ కాపిటలైజేషన్‌ ఏకంగా రూ.7.23 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. బిఎస్‌ఇ లిస్టెడ్‌ కంపెనీల్లో టాప్‌-10లో ఉన్న రిలయన్స్‌ ఇండిస్టీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.19.64 లక్షల కోట్లుగా ఉంది. రెండో స్థానంలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) విలువ రూ.15.13 లక్షల కోట్లుగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఎం-క్యాప్‌ రూ.10.66 లక్షల కోట్లు, ఇన్పోసిస్‌ ఎం-క్యాప్‌ రూ.7.02 లక్షల కోట్లుగా ఉంది. గత నెలలో ఆరో స్థానంలో ఉన్న ఎస్‌బిఐని ఎల్‌ఐసి అధిగమించింది.

➡️