కేంద్రానికి ఆర్‌బిఐ బంఫర్‌ డివిడెండ్‌

May 22,2024 21:05 #Business

2023-24కుగాను రూ.2.1 లక్షల కోట్లు
ఇంతక్రితం కంటే 140 శాతం అదనం
న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) కేంద్ర భక్తిని చాటుకుంది. ఆర్థిక సంవత్సరం 2022-23కు గాను ఏకంగా రూ.2.1 లక్షల కోట్ల రికార్డ్‌ డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బిఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు సమావేశమై డివిడెండ్‌ నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయమై ఆమోదం తెలిపారు. ఇంతక్రితం 2022ా23 ఆర్థిక సంవత్సరంలో రూ.87,420 కోట్ల డివిడెండ్‌ను అందించింది. దీంతో పోల్చితే రెండు రెట్ల (140 శాతం) పైగా పెంచడం విశేషం.
ఆర్థిక సంవత్సరం 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో ఆర్‌బిఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో రూ.1.02 లక్షల కోట్లు సమకూరుతాయని కేంద్రం అంచనా వేసింది. మరోవైపు ఈ ఏడాది రూ.75,000-1,20,000 కోట్ల మేర ఆర్‌బిఐ డివిడెండ్‌ ప్రకటించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ప్రభుత్వం సహా ఆర్థిక నిపుణుల అంచనాలు మించి ఆర్‌బిఐ రికార్డ్‌ స్థాయిలో డివిడెండ్‌ ప్రకటన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆర్‌బిఐ చెల్లించనున్న డివిడెంట్‌తో కొత్తగా అధికారం చేపట్టే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరనుంది. పెట్టుబడులపై వచ్చే మిగులు ఆదాయం, కరెన్సీ ముద్రణ కోసం తీసుకునే ఛార్జ్‌, తమ వద్ద డాలర్ల విలువలో హెచ్చుతగ్గులపై వచ్చే ఆదాయం, బ్యాంక్‌లకు ఇచ్చే రుణాలపై వచ్చే వడ్డీ తదితర ఆదాయాల నుంచి ఆర్‌బిఐ ప్రతీ ఏడాది డివిడెండ్‌ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఆర్‌బిఐ ఇచ్చిన డివిడెండ్‌ వల్ల కేంద్రం తన ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది.

➡️