RBIకి చేరని రూ.7,755 కోట్లు..!

Jul 1,2024 16:28 #2, #2000 notes, #Cash in circulation, #RBI
  • ఇప్పటికీ 2.13 శాతం రూ.2వేల నోట్లు

న్యూఢిల్లీ : ఇప్పటికీ రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చేరలేదు. మొత్తం చలామణిలోని దాదాపు 97.87 శాతం నోట్లు తమ వద్దకు చేరాయని ఆర్‌బిఐ సోమవారం వెల్లడించింది. ఇంకా 2.13 శాతం నోట్లు బయటి నుంచి రావాల్సి ఉందని పేర్కొంది. 2023 మే 19న ఈ పెద్ద నోట్లను ఆర్‌బిఐ ఉపసంహరించుకుంది. అప్పట్లో ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది అక్టోబర్‌ 7వరకూ దేశంలోని అన్ని బ్యాంక్‌ శాఖల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బిఐ స్థానిక కార్యాలయాల్లో నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. పెద్ద నోట్ల పేరిట ప్రధానీ మోడీ 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో ఏకంగా రూ.2,000 నోటును ప్రవేశపెట్టారు. తీవ్ర విమర్శలు రావడంతో గతేడాది ఈ నోటును వెనక్కి తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

➡️