అంగన్‌వాడీల ఆగ్రహం

Dec 22,2023 21:21

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు శుక్రవారం కదం తొక్కారు. 11రోజులైనా ప్రభుత్వం స్పందించక పోవడంతో రహదారులపై బైఠాయించారు. స్త్రీ శిశుసంక్షేమశాఖా మంత్రి అంగన్‌వాడీలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కలెక్టరేట్‌ నుంచి బొబ్బిలి వైపు వెళ్లే జాతీయ రహదారిపై యూత్‌ హాస్టల్‌ ఎదురుగా బైఠాయించారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని నినాదాలు చేశారు. అరగంట పాటు చేసిన రాస్తారోకోతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సమస్యల పరిష్కరించేవరకు తమ పోరాటం ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూపడం సరికాదన్నారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాస్తారోకో విరమించి కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్షను సాయంత్రం వరకు కొనసాగించారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలుపుతూ యుటి ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. వారేమీ ఒంటరి వారు కాదని, వారికి అన్ని వర్గాల ప్రజలు సహకారం, మద్దతు ఉందన్నారు. మద్దతు తెలిపిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నాయకులు ఎ.జగన్మోహన్‌, బి.సుధారాణి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మె కు ఎఐఎఫ్‌టియు నాయకులు బెహరా శంకర్రావు మద్దతు తెలిపారు.

బొబ్బిలి : పట్టణంలోని జెండమాల్‌ జంక్షన్‌ లో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, ఉమాగౌరి, అనురాధ, బి.నిర్మల, పి.పద్మ తదితరులు పాల్గొన్నారు.గజపతినగరం : స్థానిక నాలుగురోడ్ల జంక్షన్‌లో అంగన్‌వాడీలు రాస్తారోకో చేశారు. స్త్రీశిశు సంక్షేమశాఖా మంత్రి అంగన్‌వాడీలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుభాషిని, పి.జ్యోతి, డి.నాగమణి, నారాయణమ్మ, రాములమ్మ, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

జామి : తహశీల్దార్‌ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీగా వెళ్లి, బస్టాండ్‌ జంక్షన్‌లో మానవహారం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

కొత్తవలస : కొత్తవలస జంక్షన్‌లో రాస్తారోకో చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోళ్ల లలితకుమారి సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అంగన్‌ వాడీలపై బెదిరింపుల మానుకొని ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ నాయకులు కాకర తులసి, రెడ్డి శంకరావతి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

బాడంగి : అంగన్‌వాడీలంతా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు..

రామభద్రపురం : స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిర్వహిస్తున్న శిబిరంలో మెడకు ఉరితాల్లు వేసుకొని అంగన్‌వాడీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వీరికి సిఐటియు మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నేతలు రాదమ్మ, చిన్నమ్మలు, గౌరి,సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

శృంగవరపుకోట : పట్టణంలోని అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు.

రాజాం : పట్టణంలో అంగన్‌వాడీలంతా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తినాయుడు మాట్లాడారు. యూనియన్‌ నాయకులు ఉమా కుమారి ,సునీత ,భారతి ,చిన్నమ్మడు, జయలక్ష్మి, కాళీ రత్నం, పద్మ, పార్వతి ,లక్ష్మీనారాయణ ,వనజ ,ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

భోగాపురం : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ మద్దతు తెలిపారు. హామీ ఇచ్చినప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. తెలుగు యువత కార్యనిర్వాహణ కార్యదర్శి కర్రోతు రాజు పాల్గొన్నారు. అంతకుముందు సిఐటియు జిల్లా కార్యదర్శి బి. సూర్య నారాయణ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. యూనియన్‌ నాయకులు క్రిష్ణవేణి, కొర్లమ్మ, అనిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️