అంగన్వాడీల విజయోత్సవాలు

Jan 23,2024 18:07

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  నిర్బంధాలను, అరెస్టులను అధిగమించి.. బెదిరింపులకు, ఎస్మా చట్టాలకు, తొలగింపు ఉత్తర్వులకు బెదరకుండా..42 రోజులు పాటు ఐక్యంగా పోరాడి విజయం సాధించిన అంగన్వాడీలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం విజయోత్సవాలు జరుపుకున్నారు. అనేక రకాలంగా ప్రభుత్వం, అధికారులు అంగన్వాడీలపై బెదిరింపు చర్యలకు పాల్పడినప్పటికీ మొక్కవోని దీక్షతో సమ్మె కొనసాగించి విజయం సాధించారు. ఈనేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌ సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు బి.పైడిరాజు అధ్యక్షతన విజయోత్సవ సభ జరిగింది. అంగన్వాడీ యూనియన్‌ నాయకులతోపాటు సిఐటియు, ఇఫ్టూ, ఎఐఎఫ్‌టియు, ఆర్‌టిసి స్టాఫ్‌అండ్‌ వర్కర్స్‌ ఫెడరేటషన్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డివైఎఫ్‌ఐ నాయకులు విజయోత్సవ సూచకగా అభివాదం చేశారు. అనంతరం పైడిరాజు మాట్లాడుతూ 42 రోజులుగా సమ్మెలో ఉన్న తమకు మనోధర్యాన్ని అందించి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా నిలిచిన కార్మిక, ఉపాధ్యాయ ,ఉద్యోగ ,రైతు, విద్యార్థి ,మహిళా, యువజన సంఘాలకు, రాజకీయ పార్టీలకుీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం అంగన్వాడీలది మాత్రమే కాదని, అందరి విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రాణాలకు తెగించి నిరవధిక దీక్షలో పాల్గొన్న రాష్ట్ర నాయకత్వానికి జేజేలు పలికారు. అనంతరం నాయకులు ఎం. శ్రీనివాస, రెడ్డి శంకర్రావు, రెడ్డి నారాయణరావు, జి. అప్పలసూరి, పి.రమణమ్మ, సిహెచ్‌. వెంకట్రావు, బి.రమణ, సుధారాణి, ఎ.జగన్మోహన్‌ రావు, వెంకటేష్‌ , హరీష్‌ మాట్లాడారు. మొక్కవోని దీక్షతో 42 రోజులు సమ్మె చేసి పోరాడి విజయం సాధించిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు అభినందనలు తెలిపారు. పోరాట పటిమ ముందు ప్రభుత్వ బెదిరింపులు, ఎస్మా చట్టం, తొలగింపు ఉత్తర్వులు తుస్సుమన్నాయని కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు భవిష్యత్తులో ఇదే ఐక్యతను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సభలో విజయనగరం అర్బన్‌ ప్రాజెక్ట్‌ అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️