అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు తెలపండి

Dec 2,2023 20:05

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, గజపతినగరం  :  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 8 నుంచి సమ్మెలోకి వెళ్లనున్న నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్‌వాడీ కార్యకర్తలు సచివాలయ కార్యదర్శులకు, విజయనగరంలోని డివిజన్‌ కార్పొరేటర్లకు, సచివాలయ కార్యదర్శులకు సమ్మె నోటీసులు అందజేశారు. సమ్మె సన్నాహకంలో భాగంగా నల్లబ్యాడ్జీలు ధరించి శనివారం విధులకు హాజరయ్యారు. కార్పొరేటర్లు రామకృష్ణ, భానుమూర్తి, గాజులరేగ ఇన్‌ఛార్జి కె.రాజాకు, సచివాలయ కార్యదర్శులకు సమ్మె నోటీసు అందజేశారు. తమ సమ్మెకు సహకరించాలని ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, ప్రాజెక్ట్‌ నాయకులు ప్రభ, విశాలాక్షి, శివలక్ష్మి, లలిత, తిరుమల, ప్రసన్న, తదితరులు తెలిపారు. సమ్మె లేదని అధికారులతో చెప్పించి వర్కర్లను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని, చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. గత 4 సంవత్సరాలుగా అనేక రూపాల్లో మా యొక్క నిరసనలు తెలియజేశామని, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతోనే సమ్మె చేయాల్సి వస్తుందని లబ్ధిదారులు, ప్రజలు, ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరారు. సమ్మెకు సహకరించాలని గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులను కోరారు. మరోవైపు సమ్మెకు వెళ్తున్నట్లు సచివాలయ కార్యదర్శులకు నోటీసులు అందజేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని డిసెంబర్‌ 8వ తేదీ నుంచి అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేస్తున్నట్లు ప్రాజెక్టు కార్యదర్శి పి జ్యోతి, సెక్టార్‌ లీడర్లు వాణి, ముత్యాలమ్మ, పద్మ, పద్మ కళా తెలియజేశారు. మానాపురం, గుచ్చిమి, మరడం, పోరలి, చామలవలసలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుందో వివరిస్తూ.. కరపత్రాలు పంచుతూ సమ్మెకు మద్దతు ఇవ్వాలని లబ్ధిదారులనున కోరారు. మానాపురం, మరడాం సచివాల కార్యదర్శులకు వినతి పత్రాలు ఇచ్చారు. సమ్మెకు రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాలు, లబ్ధిదారులు ప్రజలు సహకరించాలని కోరారు. మెంటాడ మండలం జయంతి,మెంటాడ, పోరాంలో తమ సమ్మెకు మద్దతు కోరుతూ లబ్ధిదారులకు వినతులు అందజేశారు. సెక్టారు నాయకులు జి.సన్యాసమ్మ, సుజాత, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం మండలం మధుపాడలో సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. సెక్టార్‌ నాయకులు నారాయణమ్మ, వెంకటలక్ష్మి, మాట్లాడారు. తుమ్మికాపల్లిలో ప్రాజెక్టు అధ్యక్షులు ఎం.సుభాషిని ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు. దత్తిరాజేరు మండలం దత్తి సచివాలయంలోఓ పి.జ్యోతి, సూర్యకాంతం, దమయంతి, లీలాకుమారి తదితరులు ప్రచారం చేపట్టారు.

➡️