అంగన్‌వాడీల సమ్మెకు విస్తృత మద్దతు

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీలు జిల్లావ్యాప్తంగా చేపట్టిన సమ్మె సోమవారం పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సమ్మె 7వ రోజుకు చేరుకుంది. అమలాపురం అంగన్‌వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు అన్నారు. సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తోందన్నారు. తక్షణం వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వందలాదిమంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఆర్‌డిఒ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్‌డికు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ట్రెజరర్‌ పి.అమూల్య, ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎం.విజయ, కె.బేబీగంగారత్నం, నాయకులు రత్నకుమారి, పార్వతి, దైవకృప, ధనలక్ష్మి, మణిమాల, రుక్మిణి, పరిపూర్ణ, సుబ్బలక్ష్మి, శమంతకమణి పాల్గొన్నారు. మామిడికుదురు తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో నోట్లో పచ్చగడ్డి పెట్టుకుని వినూతన్న రీతిలో నిరసన తెలిపారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. సమస్య పరిష్కరించకుండా ఉద్యమాన్ని అణచి వేయాలనుకోవడం సరి కాదన్నారు.ముమ్మిడివరం అంగన్‌వాడీ సమస్యల పట్ల ప్రభుత్వ బాధ్యతారాహిత్యం తగదని పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. నగర పంచాయతీ పరిధిలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులు, పేద వర్గాల పట్ల వైసిపి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో తాళాలు పగులగొట్టించి, నిరంకుశ పోకడలను అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకర్‌, నాయకులు దేవరపల్లి రాజేంద్రబాబు, పి.జగ్గప్పరాజు, వడ్డి నాగేశ్వరరావు, పి.ఉదయ భాస్కర వర్మ, కంచుస్తంబం సోనీ, ముషిణి శివ ప్రసాద్‌, గుబ్బల రవి, గోడి భాస్కరరావు, కొత్తూరు శ్రీనివాస్‌, కాశి అచ్యుత రామయ్య, దోనిపాటి విజయలక్ష్మి, రాయుడు గంగా భవాని తదితరులు మద్దతు తెలిపారు. అనంతరం అంగన్‌వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు దుర్గా మహేశ్వరి, కార్యదర్శి జయలక్ష్మి, ప్రాజెక్ట్‌ కమిటీ సభ్యులు తలుపులమ్మ, సుభాషిణి, శ్రీదేవి, సుబ్బలక్ష్మి, విజయ, అనంతలక్ష్మి, రమాదేవి, అరుణ పాల్గొన్నారు. రామచంద్రపురం డివిజన్‌ పరిధిలోని కపిలేశ్వరపురం, మండపేట, రామచంద్రపురం, కె.గంగవరం మండలాల నుంచి పెద్ద ఎత్తున అంగన్వాడీలు ఆర్‌డిఒ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు అంగన్వాడీలను గేటు బయట అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు గేటు బయట బైఠాయించి నినాదాలు చేశారు. జీతాలు పెంచాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఆర్‌డిఒ కార్యాలయం ముందు పడుకుని నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో డి.ఆదిలక్ష్మి, ఎం.దుర్గ, సిఐటియు నాయకులు నూకల బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 మంది అంగన్వాడీలు ఈ ముట్టడిలో పాల్గొన్నారు.ఐ.పోలవరం అంగన్వాడీలు సమ్మెలో ఉన్న పరిస్థితుల్లో కేంద్రాలను తెరిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా తాళాలను పగలగొట్టి తలుపులు తీసినా పిల్లలు, లబ్ధిదారులు రాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది తాళాలు బద్దలు కొట్టి కొన్ని అంగన్వాడీ కేంద్రాలను తెరిచినప్పటికీ అవి వెలవెల బోతున్నాయి. గుత్తెనదీవి, గోగుల్లంక, బైరవపాలెం, పాతఇంజరం, ఎదుర్లంక, కొమరగిరి అంగన్వాడీ కేంద్రం తలుపులు బద్దలు కొట్టి తెరిచినప్పటికీ పిల్లలు, లబ్ధిదారులు రాలేదు.కేవలం మహిళా పోలీసులు మాత్రమే తలుపు తీసి కూర్చున్నారు. కొత్తపేట నాలుగు మండలాల నుంచి సుమారు 500 మంది అంగన్వాడీలు ఆర్‌డిఒ ఆఫీసు నుంచి స్థానిక మండల పరిషత్‌ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్‌డిఒ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌ఒ.మాధురికి వినతిపత్రం ఇచ్చారు.అంబాజీపేట అంగన్‌వాడీలకు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి దాసరి వీరవెంకటసత్యనారాయణ మద్దతు తెలిపారు. సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు.

➡️