అంగన్వాడీల సమ్మె ప్రారంభం

ప్రజాశక్తి – సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్‌ : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పల్నాడు జిల్లాలోనూ మంగళవారం నుండి సమ్మె చేపట్టారు. సత్తెనపల్లిలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక పుతంభాక భవన్‌ నుండి తాలూకా సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహం వరకూ ర్యాలీ చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి వినతిపత్రాన్ని ఇచ్చారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెకు సిఐటియు మద్దతు తెలుపుతుందని అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలిస్తామని జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని, తక్షణం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమ్మె శిబిరం ఏర్పాటు కోసం పట్టణ పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలు నోటీసు ఇచ్చారు.
ఇదిలా ఉండగా స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సత్తెనపల్లి ప్రాజెక్టు స్థాయిలో అంగన్వాడీల సదస్సు జి.సుజాత అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విజరుకుమార్‌ మాట్లాడుతూ మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని, ప్రీస్కూల్‌ బలోపేతం చేయాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని, ప్రమోషన్‌ వయసు 50 ఏళ్లకు పెంచాలని అన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబలో ఒకరికి ఉద్యోగం, బీమా ఇవ్వాలన్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కోరారు. సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌, అంగన్వాడీ నాయకులు కెఎస్‌కె సుజాత, అహల్యా, జ్యోతి, అంజలి, చాముండేశ్వరి, భవానీ, నాగమణి, విజయలక్ష్మి ధనలక్ష్మి అమల, డివైఎఫ్‌ఐ నాయకులు జె.రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – వినుకొండ :
స్తానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఎఐటియుసి, ఐఎఎఫ్‌టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మె శిబిరం ప్రారంభించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి మాట్లాడారు. పలు యూనియన్ల నాయకులు బి.వెంకటేశ్వర్లు, ఎఎల్‌ ప్రసన్నకుమారి, ఎం.సారమ్మ, విజయకుమారి, జి.పద్మ, జె.పద్మావతి, డి.బీబులు, ఎస్‌కె మున్ని, ఉమాశంకరి, వి.ప్రసూనాంబ, శ్రీదేవి, సీతామహాలక్ష్మి, శేషు కుమారి, కృష్ణకుమారి, సుజాత, శారద పాల్గొన్నారు.

ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక పండరీపురంలోని సిఐటియు కార్యాలయం నుండి అంగన్వాడీలు భారీ ప్రదర్శన చేపట్టారు. ఎన్‌ఆర్‌టి సెంటర్‌, రిజిస్ట్రార్‌ కార్యాలయం, గడియారం స్తంభం, తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌, బాబూజగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు వినతి పత్రాలను ఇచ్చారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షులు జి.సావిత్ర మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సానుకుల స్పందన లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. గురువారం నుండి తహశీల్దార్‌ కార్యాలయం వద్దే వంటావార్పు చేపడతామని ప్రకటించారు. రమాదేవి, పి.వెంకటేశ్వర్లు, టి.ప్రతాప్‌కుమార్‌, అంగన్వాడీలు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-దాచేపల్లి : మండల కేంద్రమైన దాచేపల్లిలోని బొడ్రాయి సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాయకులు మల్లేశ్వరి, ప్రమీల మాట్లాడారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, అంగన్వాడీలు అన్నపూర్ణ, శ్రీదేవి భారతీ, భవాని జ్యోతి, విజయలక్ష్మి, వెంకాయమ్మ పాల్గొన్నారు.

ప్రజాశక్తి-ఈపూరు : మండల కేంద్రమైన ఈపూరులోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద ఈపూరు, బొల్లాపల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాయకులు ఎం.దేవసహాయం, వెంకటరమణ, సరోజిని పాల్గొన్నారు.

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి హైలాండ్‌ సెంటర్‌ వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ హజ్రా, డి.శాంతమణి మాట్లాడుతూ తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు పెంచుతామని చెప్పారని, ఇప్పటివరకు ఒక్క రూపాయి పెంచలేదని మండిపడ్డారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌తో కూడిన సౌకర్యాలు కల్పించాలని, ఫేస్‌యాప్‌ను వెటంటనే రద్దు చేయాలని, వైఎస్‌ఆర్‌ పోషణ మెనూ నాణ్యమైనది సరఫరా చేయాలని కోరారు. నాయకులు శివరంజని, కవిత, వెంకటరమణ, జోష్ణ, శాంతి కుమారి, జయశ్రీ, హసీనా పాల్గొన్నారు.

ప్రజాశక్తి – మాచర్ల : స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు ఉషారాణి మాట్లాడుతూ రిటైర్‌మెంట్‌ వయస్సును 62కు సవరించాలన్నారు. అంగన్‌వాడీలు, హెల్పర్స్‌ చనిపోతే మట్టి ఖర్చుల క్రింద రూ.50 వేలు ఇవ్వాలని, బీమా వర్తింపు చేయాలని కోరారు. నాయకులు సైదమ్మ, మల్లేశ్వరి, మహలక్ష్మీ, రుక్మిణి, సిఐటియు నాయకులు సురేష్‌, వెంకటరత్నం పాల్గొన్నారు.

ప్రజాశక్తి-క్రోసూరు : సమ్మె సందర్భంగా ఆమంచి విజ్ఞాన కేంద్రంలో సభ, అనంతరం నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడుతూ మాట తప్పను మడమతిప్పను అంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కనీసం అంనగ్వాడీల సమస్యలపై చర్చించడానికి కూడా సిద్ధమవడం లేదని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. యూనియన్‌ క్రోసూరు ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు శివపార్వతి జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలకు ఏ రోజుకు ఆ రోజు పని భారం తీవ్రంగా పెరుగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. రకరకాల యాప్‌ల పేరుతో పని భారం పెరిగిందని, యాప్‌లను క్రోడీకరించి ఒకే దానిలో అప్లోడ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడి సెంటర్లకు వస్తున్న చిన్న గుడ్లు, పాడైన కందిపప్పు, ఇతర తేడాలతో ఫీడింగ్‌ వస్తే దానికి అంగన్వాడీలను బాధ్యు లుగా చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాన్నారు. నాయకులు రేవతి, ఉషా, డివి సామ్రాజ్యం, కుమారి, శోభ, అషాబేగం, విజయలక్ష్మి, మెరీనా, మంగమ్మ, ధనలక్ష్మి, వెంకాయమ్మ, అష్రీఫూన్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి- పెదకూరపాడు : మండలంలోని తాళ్లూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలు ధర్నా చేశారు. పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

➡️