‘అంబేద్కర్‌’ చిత్ర ప్రదర్శన ప్రారంభం

'అంబేద్కర్‌' చిత్ర ప్రదర్శన ప్రారంభం

ప్రజాశక్తి-కాకినాడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ దేశ ప్రజలందరికీ ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా పేర్కొన్నారు. సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్‌ జీవిత చరిత్రపై గురువారం కలెక్టరేట్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. అంబేద్కర్‌ జీవితంపై ఏర్పాటు చేసిన ఈ ఛాయా చిత్రాల ప్రదర్శనను కలెక్టర్‌ ప్రారంభించారు. అంబేద్కర్‌ జననం, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాజ్యాంగ రచన, వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఎంపీ వంగాగీత, ఎంఎల్‌సికర్రి పద్మశ్రీ, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, జెడ్‌పి సిఇఒ ఎ.వెంకట రమణారెడ్డి, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, డిపిఒ కె.భారతి సౌజన్య, విద్యాశాఖ ఆర్‌జెడి జి.నాగమణి ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించేలా సిఎం వైఎస్‌.జగన్‌ ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్‌ సేవలకు ప్రతిరూపంగా నిర్మించిన స్మతి వనాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 09 నుంచి 12 తేదీ వరకు గ్రామ సచివాలయం, మండలం, జిల్లా స్థాయిల్లో జన్‌ భగీదర్‌ కార్యక్రమం కింద అంబేద్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పిస్తారని, పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్‌ జీవిత విశేషాలపై అవగాహన పెంపొందిస్తూ వివిధ పోటీలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయ స్థాయిలో అంబేద్కర్‌ విగ్రహాలను శుభ్రం చేసి ఘనంగా నివాళులర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున, దళిత సామాజికవేత్త పెట్టా వరప్రసాద్‌, సాంఘిక సంక్షేమ జెడి డివి.రమణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జె.నరసింహ నాయక్‌, ఐసిడిఎస్‌ పీడీ కె.ప్రవీణ, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️