అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’

Dec 26,2023 21:42

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  :  ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు జిల్లా అంతటా ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ క్రీడామైదానంలో, పులివేషాలు, కర్రసాము, కత్తిసాము తదితర సంప్రదాయ జానపద కళల కోలాహలం నడుమ పండగ వాతావరణంలో మంగళవారం క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. డిప్యుటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం పోటీలకు శ్రీకారం చుట్టారు. స్వయంగా తాము కూడా ఆటల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. స్పోర్ట్స్‌ అంబాసిడర్లుగా నియమితులైన కామన్‌వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పతక విజేత మత్స సంతోషి, జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, ప్రముఖ స్కేటింగ్‌ క్రీడాకారుడు సాయితేజను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పోటీలను నిర్వహిస్తోందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో క్రీడల పరంగా ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పారు. ఈ పోటీలవల్ల గ్రామీణ స్థాయి క్రీడా ప్రతిభ వెలుగులోకి వస్తుందని చెప్పారు. క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. విజయనగరం జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలను సాధించాలని కోరారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, ఆరోగ్యకర జీవన విధానం కోసం క్రీడలపై ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలని కోరారు. క్రీడల్లో గెలుపు కంటే, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ముఖ్యమని సూచించారు. క్రీడాకారులను భారీ ఎత్తున ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి విజేతలకు నగదు బహుమతులను కూడా ఇస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఐదు స్థాయిల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు.జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల వివరాలను వెల్లడించారు. జిల్లాలో సుమారు లక్షా, 42వేల మంది ఈ పోటీల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చారన్నారు. కబడ్డీ, క్రికెట్‌, ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటెన్‌ పోటీలతోపాటు, యోగా, మారథాన్‌ పోటీలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు ఈశ్వర్‌ కౌషిక్‌, జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌.శ్రీరాముల నాయుడు, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, సచివాలయాల నోడల్‌ అధికారి నిర్మలాదేవి, సెట్విజ్‌ సిఇఒ రామ్‌గోపాల్‌, ఛీఫ్‌ కోచ్‌ అచ్యుత్‌, వివిధ శాఖల అధికారులు, పలువురు కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి

చీపురుపల్లి : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను చీపురుపల్లిలో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, గరివిడిలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటుగా అన్ని రంగాలలో రాణించాలని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నియోజవర్గ నాలుగు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, ఆయా మండలాల నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు

➡️