అడవిలో నిప్పు పర్యావరణానికి ముప్పు

Feb 13,2024 21:42

ప్రజాశక్తి – సీతంపేట : అడవిలో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు నివారణా చర్యలు చేపట్టాలని ఫారెస్ట్‌ బీట్‌ అధికారి దాలి నాయుడు అన్నారు. సీతంపేట ఏజెన్సీలో అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద పొల్ల, తాడిపాయి, గాడిదపాయి, జయపురం, నాయకమ్మ గూడా తదితర గ్రామాల్లో మంగళవారం అడవిలో నిప్పు… పర్యావరణానికి ముప్పు.. అడివి సంరక్షణ సమస్త జీవకోటి పరిరక్షణ అన్న నినాదంతో అవగాహన కల్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి అవగాహన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవి ప్రాంతాల్లో నేలపై ఆకులు ఎండినా, తుప్పలు వాటి అంతట అవే కుళ్లి నేలపై సారముల ఏర్పడతాయని వాటిని, కాల్చి బూడిద చేయరాదని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో కాల్చిన సిగరెట్‌, బీడీలు, మంటలకు సహకరించే వస్తువులు పడే రాదని చెప్పారు. తేనె, చీపుర్లు మొదలగు అటవీ ఉత్పత్తులు సేకరించేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పారు. కొమరాడ : కొండపోడు రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాల్లో సంభవిస్తున్న అగ్ని ప్రమాదాల నియంత్రణపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్టు అటవీశాఖ కొమరాడ ఫారెస్టర్‌ ఎస్‌.గౌరీశంకరరాజు స్పష్టం చేశారు. మంగళవారం కొమరాడ సెక్షన్‌ పరిధిలో గల వివిధ గిరిజన గ్రామాల్లో అగ్ని ప్రమాదాలపై అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌ గౌరీశంకర్‌రాజు మాట్లాడుతూ కొండచీపుర్లు, జీడిసాగు చేస్తున్న ప్రాంతాల్లో ఫలసాయం అయిపోయిన తర్వాత అగ్గిపెట్టడం గిరిజనులకు ఆనవాయితీగా వస్తోందన్నారు. మంటల కారణంగా కొండల్లో ఉండాల్సిన జంతువులు మైదాన ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు వంద గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కల్పించామన్నారు. ముఖ్యంగా పోడు వ్యవసాయం చేసే సమయంలో గిరిజన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్గి మంటలు పెట్టరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ గార్డులు సత్యనారాయణ, లక్ష్మణరావు, రాజు, గోపిక ఉన్నారు.

➡️