అడుగంటుతున్న జలాశయాలు

Mar 27,2024 22:54

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాల్లోనీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. మరోమూడు నెలల్లో పులిచింతలలో పూర్తిగా నిల్వలు పూర్తి స్థాయిలో అడుగింటిపోయే ప్రమాదం నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి పొంచి ఉంది. ఆరు నెలలుగా సరైన వర్షాల్లేక ప్రధాన జలాశయాలలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఎగువ నుంచి నీటి ప్రవాహం రాకపోవడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలు అతి తక్కువ నీటి మట్టానికి నీటి నిల్వలు తగ్గిపోయాయి. ప్రధానంగా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు, దాదాపు 400 గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగపడే పులిచింతల జలాశయంలో గరిష్టనీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా బుధవారం రాత్రి 4.67 టిఎంసీలకు నీటి నిల్వ పడిపోయింది. గేడాది ఇదే రోజుల్లో పులిచింతలలో నీటి నిల్వ 28 టిఎంసీలు ఉండగా ఈ ఏడాది ప్రస్తుతం 4.67 టిఎంసీలకు తగ్గింది. శ్రీశైలంలో గరిష్ట నీటి నిల్వ 215.80 టిఎంసిలు కాగా ప్రస్తుతం 35.70 టిఎంసీలు మాత్రమే ఉంది. నాగార్జున సాగర్‌లో గరిష్ట నీటినిల్వ 312.01 టిఎంసిలుకాగా ప్రస్తుతం 137.76 టిఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. మొత్తంగా ప్రధాన జలాశయాల్లో కనీస నీటి నిల్వలు అడుగంటాయి. నాగార్జున సాగర్‌,శ్రీశైలంలో నీటి నిల్వ డెడ్‌ స్టోరేజికి చేరుకుంది. పులిచింతలలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోయి అడుగంటే పరిస్థితి నెలకొంది. పులిచింతలలో నీటినిల్వ బాగా తగ్గిపోవడం వల్ల ప్రకాశం బ్యారేజి వద్ద కూడా నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోయింది. ప్రకాశం బ్యారేజి గరిష్టనీటి నిల్వ 3.08 టిఎంసీలుగా కాగా ప్రస్తుతం 2.24 టిఎంసీలే నిల్వ ఉండటం వల్ల గుంటూరు, ఎన్‌టిఆర్‌, కృష్ణా, బాపట్ల జిల్లాలకు కనీసం చెరువులు నింపుకోవడానికి కూడా ఇబ్బంది రానుంది. నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ తగ్గడం వల్ల పల్నాడు, ప్రకాశం జిల్లాలకు కూడా నీటి ఎద్దడి పెరిగింది. కాల్వలు, చెరువులు, జలాశయాల్లో నీరు తగ్గిపోవడం వల్ల భూగర్భజలాల నిల్వలు తగ్గిపోవడంతో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చనుంది. ప్రస్తుతం సాగర్‌ నుంచి నీరు విడుదల చేసేపరిస్థితి లేదని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో ప్రకాశం, పల్నాడు జిల్లాలో దాదాపు 200 గ్రామాల్లో నీటి సమస్య రావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిఏటా మేనెలలో నీటిఎద్దడి వస్తుందని, కానీ ఈ ఏడాది మార్చిచివరికే ఈ సమస్య రావచ్చని అంటున్నారు. ఈఏడాది జులై నుంచి ఇప్పటి వరకు ఎగువ నుంచి వరద ప్రవాహం రాకపోవడం వల్ల ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. పులిచింతలలోనీటి నిల్వ తగ్గి బురదతో కూడిన కలుషిత నీరు ప్రకాశం బ్కారేజికి చేరడం వల్ల గుంటూరు కార్పొరేషన్‌తో పాటు పలు గ్రామాలకు, పట్టణాలకు ఫిల్టరేషన్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. పలుచోట్ల డయేరియా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో పల్నాడు జిల్లాతోపాటు గుంటూరు జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని దాదాపు 200 గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

➡️