అనకాపల్లిలో గెలుపునకు సమిష్టగా కృషి

మీడియా సమావేశంలో పాల్గొన్న కొణతాల రామకృష్ణ, పరుచూరి భాస్కరరావు

ప్రజాశక్తి -అనకాపల్లి

టిడిపి, జనసేన సమిష్టగా కృషి చేసి అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆ రెండు పార్టీల అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక బైపాస్‌ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కరరావుతో కలిసి కొణతాల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరుచూరి భాస్కరరావు తెర వెనుక ఉండి గతంలో అనేక మంది నాయకులను గెలిపించినట్లు చెప్పారు. జనసేన, టిడిపి, బిజెపి ఏకమై రాష్ట్రంలో అధికారంలో వస్తామని, తద్వారా విభజన హామీలను, అమరావతి నిర్మాణం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, స్టీల్‌ప్లాంట్‌ రక్షణ సాధిస్తామని చెప్పారు. ముందుగా శ్రీనూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అధ్యక్షుల నిర్ణయాన్ని గౌరవిస్తాను : పరుచూరిజనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల బరిలో అనకాపల్లి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణని ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు తెలిపారు. అనకాపల్లి టికెట్‌ ప్రకటన అనంతరం తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. ఐదు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి తనకు అన్ని విధాలుగా సహకరించిన కార్యకర్తలు పార్టీ అధినేత నిర్ణయాన్ని గౌరవించి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం తాను కాపు, గవర కులంలో పుట్టకపోవడమే తాను చేసిన తప్పు అని ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారే తత్వం తనది కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️