అను’మతి’ఉన్నట్టా.. లేనట్టా..?

Dec 31,2023 20:51

వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక అక్రమ రవాణా ఊపందుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులూ లేకుండానే ఇష్టానుసారంగా నదిలో జెసిబిలు పెట్టి ఇసుకను తవ్వేస్తున్నారు. రాత్రి పగలూ తేడా లేకుండా తవ్వి లారీలతో తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాగునీటి ప్రాజెక్టులు, వంతెన చుట్టు పక్కల ఇసుక తవ్వకూడదన్న నిబంధనలను సైతం లేక్క చేయకుండా తవ్వేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా నది మధ్యలో నుంచి అడ్డుకట్ట వేసి కిందకు నీటిని విడుదల చేయకుండా ఇసుకను తవ్వేయడంతో నదీ పరివాహక ప్రాంతాల రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రజాశక్తి- రేగిడి : సంకిలి పంచాయతీ పరిధి బొడ్డవలస నాగావళి నది ఆనించి పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం గోపాలపురం ఇరు గ్రామాలకు సంబంధించి నాగావళి నదిలో ఇసుక ర్యాంపు అనుమతులు లేకుండా యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ నాగావళి నదిని దోచేస్తున్నారు. అక్కడ తవ్వకాలు చూస్తుంటే ఈ ర్యాంపునకు అనుమతులున్నాయా? లేదా అన్న అనుమానం కలుగుతుంది. 24 గంటలూ అధిక సంఖ్యల లారీలతో ఇతర ప్రాంతాలకు మాన్యువల్‌ పద్ధతిలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అనువుగా నది మధ్యలో నుంచి అడ్డంగా పొడవునా పెద్ద ఇసుక ర్యాంపును తయారు చేసి జెసిపిలతో ఇసుకను తవ్వి లక్షల రూపాయలు కాసులు వెనకేసుకుంటున్నారు. నదికి అడ్డంగా కట్టఇసుకను తవ్వేందుకు అనువుగా నాగావళి నదికి అడ్డంగా అడ్డుకట్ట వేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు చుక్క నీరు వెళ్లడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్‌ 5 మండలాలకు తాగునీటి ఇబ్బందులు దృష్ట్యా రూ.147 కోట్లతో మూడు తాగునీటి పైలెట్‌ ప్రాజెక్టులను నిర్మించి ప్రారంభించారు. ఇప్పుడు ఆ తాగునీటి ప్రాజెక్టుల సమీపంలోనే తవ్వకాలు చేస్తుండటంతో భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వంతెనకూ తప్పని ముప్పురాజాం -పాలకొండ ప్రధాన రహదారిలో సంకిలి వద్ద నాగావళి నదిపై వంతెన ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ వంతెనకు సమీపంలోనే తవ్వకాలు చేస్తున్నారు. దీంతో వంతెన దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఈ ఇసుక దోపిడిలో స్థానిక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని గోపాలపురం, బొడ్డవలస గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వరదలు వస్తే ప్రమాదమేఈ ఇసుక రవాణా కారణంగా నది మొత్తాన్ని దోచేయడంతో వరదలు వస్తే గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నదీ పరివాహక గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పైగా నదిలో ఇసుక లేకుండా తవ్వేయడంతో నీటి కష్టాలు కూడా పడతామని చెబుతున్నారు. ఇసుక రవాణా చేస్తున్న సిబ్బందికి ఆన్‌లైన్‌ రసీదులు, మ్యానువల్‌ రసీదులు కూడా ఇవ్వకుండా ఇసుకను వందల లారీలతో అక్రమ రవాణా చేస్తున్నారు. ఎన్ని క్యూబిక్‌ మీటర్లకు అనుమతులున్నాయని సిబ్బందిని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడంతోనే ఈ ర్యాంపునకు ఎటువంటి అనుమతులూ లేవని తేటతెల్లమవుతోంది. కాగా ర్యాంపునకు సంబంధించిన సూపర్‌వైజర్‌ మహేష్‌ను వివరణ కోరగా మీకు నచ్చినట్లు రాసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కొసమెరుపు. ఇప్పటికైనా రెండు జిల్లాల రెవెన్యూ, మైన్స్‌, ఎస్‌ఇబి అధికారులు దృష్టి సారించి నదిని దోచేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

➡️