అన్నం పెట్టేదెలా..?

Dec 8,2023 23:48
విడుదల చేయాలని

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం సక్షేమ వసతి గృహాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో వార్డెన్లు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకుంది. చేసిన అప్పులు తీర్చేమార్గం లేకపోవటం..కొత్త అప్పులు పుట్టకపోవటతో గత్యంతరం లేక వారి వారి బంగారు వస్తువులను బ్యాంకుల్లో కుదువబెట్టి మెనూను అమలు చేస్తున్నవారు సైతం ఉన్నారు. జిల్లాలో గత 4 నెలలుగా వసతి గృహాల్లో డైట్‌ బిల్లులు పెండింగులో ఉన్నాయి. డైట్‌ బిల్లులను ఉన్నతాధికారులను అడిగితే తమ చేతుల్లో ఏమీలేదని చేతులెత్తేయడంతో వార్డెన్ల పరస్థితి అయోమయంగా మారింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ కలిపి 35 వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో 2,330 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఫ్రీ మెట్రిక్‌ వసతి గృహాల్లోని 3, 4 తరగతుల విద్యార్థులకు రూ.1,150, 5 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు రూ.1,400 మెస్‌ ఛార్జీల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లలో అక్టోబర్‌ నెల నుంచి మెస్‌ ఛార్జీలను చెల్లించిన పరిస్థితి లేదు. ఓ వైపు సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవటం, మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో ఈ ఛార్జీలు చాలడం లేదని వసతిగృహల నిర్వాహణ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులతో అవస్థలు పడుతున్న వార్డెన్లుప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవటతో వసతి గృహాల వార్డెన్లు అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు. రాజమహేంద్రవరంలోని ఒక బిసి హాస్టల్‌లో 110 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి నెలా రూ.80,000 బిల్లులు విడుదల చేయాల్సి ఉంది. అక్టోబరు తర్వాత నాలుగు నెలలుగా నిధులు విడుదల చేయలేదు. అప్పు చేసి హాస్టల్‌లో విద్యార్థులకు భోజనం పెడుతున్నామని అక్కడి ఓ అధికారి వాపోయారు. కొన్ని సార్లు ఫింగర్‌ప్రింట్‌ సమస్యలు, మ్యాపింగ్‌, కోడ్‌ సమస్యల కారణంగా నిధులు జమ చేయటం లేదని సమాచారం. మరికొన్ని రోజులు సిఎఫ్‌ ఎంఎస్‌, బిల్లుల అప్‌లోడింగ్‌ సైట్‌ ఓపెన్‌ కాకపోవడం వంటి కారణాలతోనూ ఆలస్యం అవుతుందని వార్డెన్లు చెబు తున్నారు. ఇలా అనేక కారణాలతో బిల్లులు రాష్ట్రస్థాయికి చేరడం లేదని ఆయా శాఖల్లోని అధికారులు, వార్డెన్లు వాపోతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం మూడు లేదా ఆరు నెలలకోసారి నిధులు విడుదల చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు గోరుచుట్టుపై రోకలి పోటులా మారాయి. గతేడాది కేజీ కందిపప్పు ధర రూ.110 కాగా ప్రస్తుతం రూ.160కు చేరింది. మంచినూనె లీటరు(పామాయల్‌) రూ.69లు ఉండేది ప్రస్తుతం ఆ ధర రూ.90కి చేరింది. చింతపండు రూ.99 నుంచి రూ.180కి, పెసర పప్పు రూ.80 నుంచి రూ.140కు చేరింది. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.850 నుంచి రూ.930కి చేరింది. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్‌ ఛార్జీలు పెంచాలని వార్డెన్లు కోరుతున్నారు.బిల్లులు ఎప్పుడు విడుదల చేస్తారో..! పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రరవంలో ఓ ఎస్‌సి హాస్టల్‌ వార్డెన మూడు నెలలుగా అప్పులు తెచ్చి మెనూ అమలు చేస్తున్నారు. ఒక నెల రూ.4, రెండు నెలలు రూ.5 వడ్డీకి రూ.4 లక్షలు అప్పు చేసినట్లు తెలిపారు. ఈ నెల అప్పు కోసం వెళితే ‘ఇచ్చిన అప్పు చెల్లించిన తరువాత కొత్త అప్పు ఇస్తాను’ అని చెప్పారని ఆ వార్డెన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల ముగిస్తే ఇంట్లో బంగారం, వస్తువులు అమ్మి విద్యార్థులకు భోజనం పెట్టాల్సి వస్తుందని వాపోయాడు. మరోవైపు పభుత్వం చెల్లించే ధరకు.. బయట మార్కెట్‌లో ఉన్న ధరకు భారీ వ్యత్యాసం ఉండడంతో ఏం చేయాలో వార్డెన్లకు పాలుపోవడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉన్నతాధికారులు ఎక్కడ బాధ్యులు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి 2021తో పోల్చితే గడిచిన రెండేళ్లలో ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో అప్పటి ధరలకు అనుగుణంగా భోజనం అందించడం సాధ్యమా? అని వార్డెన్లు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని వార్డెన్లతోపాటు, విద్యార్థులు కోరుతున్నారు.

➡️