అన్నం సరిగా పెట్టకుండా అరుపులు

విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి ఆంజనేయులు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) వసతిగృహాన్ని పిడుగురాళ్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి మురళీ గంగాధర్‌రావు, మండల ప్రత్యేకాధికారి, ఆంజనేయులు గురువారం పరిశీలించారు. విద్యార్థినులకు సరిగా భోజనం పెట్టడం లేదనే వీడియో వైరలైన నేపథ్యంలో వారు సందర్శనకు వచ్చారు. ఈ నెల 5వ తేదీ ఉదయం మెనూ ప్రకారం ఇడ్లీ, చెట్నీ, ఉడికించిన గుడ్డు పెట్టాల్సి ఉండగా విద్యుత్‌ సరఫరా లేని నేపథ్యంలో అన్నం, సాంబారు, గుడ్డు పెట్టారు. అయితే హాస్టల్లో మొత్తం 172 మంది ఉండగా 124 మందికి సరిపడా మాత్రమే పెట్టారు. మిగతా 48 మందికి సాంబారు లేకుండా లేకపోవడంతో వారు అడిగినందుకు వంట మనిషి, ఎఎన్‌ఎం… ‘తింటే తినండి, లేకపోతే చెత్తకుప్పలో పడవేయండి’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూపిన విద్యార్థినుల తల్లిదండ్రులు కంగారుగా హాస్టల్‌ వద్దకు వచ్చారు. కొంత మంది ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రిన్సిపాల్‌, ఇన్‌ఛార్జి వార్డెన్‌ను విలేకర్లు ప్రశ్నించగా తాము సక్రమంగానే సరుకులు ఇస్తున్నామని, వంట మనిషి సరుకులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. వంట మనిషిని ప్రశ్నించగా ప్రిన్సిపల్‌ సరిగా సరుకులిస్తే తామెందుకు పెట్టమని అన్నారు. విద్యార్థినులతో మాట్లాడగా వారంలో రెండు మూడు రోజులు ఇలానే జరుగుతోందని, అడిగితే తమపై సిబ్బంది కోప్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్‌ను జడ్జి, ప్రత్యేకాధికారి గురువారం పరిశీలించారు. ప్రిన్సిపల్‌, విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసు కున్నారు. అనంతరం ప్రత్యేకాధికారి మాట్లా డుతూ పిల్లలు చెప్పిన విషయాలకు, టీచర్లు చెప్పే విషయాలకు, ప్రిన్సిపల్‌, వంట మనిషి చెప్పే విషయాలకు పొంతన లేకుండా ఉంద న్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేయగా తప్పు జరిగినట్లు తమ దృష్టికొచ్చిందని, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని చెప్పారు.

➡️